బీఆర్ఎస్ ఎంపీ, దుబ్బాక శాసనసభ ఎన్నికల బరిలో టికెట్ దక్కించుకున్న కొత్త ప్రభాకర్ రెడ్డిపై రాజు అనే వ్యక్తి దాడి చేసిన ఘటన తెలంగాణలో సంచలనం రేపింది. దౌల్తాబాద్ లో ఎన్నికల ప్రచార సభ నిర్వహించేందుకు వెళ్లిన కొత్త ప్రభాకర్ రెడ్డి పై హఠాత్తుగా రాజు అనే వ్యక్తి దాడి చేయడంతో కొత్త ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్పందించిన టిఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసిన రాజును చితకబాది వెంటనే పోలీసులకు అప్పగించారు.
కొత్త ప్రభాకర్ రెడ్డిని గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. అయితే, కొత్త ప్రభాకర్ రెడ్డికి ప్రాణాపాయం లేదని వైద్యులు చెబుతున్నారు. ప్రభాకర్ రెడ్డికి మరింత మెరుగైన వైద్యం అందించేందుకు సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. ప్రభాకర్ రెడ్డి కత్తిపోట్లకు 6 కుట్లు పడినట్టుగా వైద్యులు చెబుతున్నారు.
ఎంపీ హోదాలో ఉన్న వ్యక్తిపై కత్తితో దాడి చేసిన వైనం ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. అయితే, ఈ ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ దాడి వెనుక ప్రతిపక్ష నేతలే ఉన్నారని బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates