వచ్చే 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోరాడేందుకు రెడీ అయిన.. టీడీపీ-జనసేన పార్టీల మధ్య సమ న్వయం సక్సెస్ అవుతోందనేటాక్ వినిపిస్తోంది. వాస్తవానికి రెండు పార్టీల అధినేతలు చేతులు కలిపినా.. క్షేత్రస్థాయిలో మాత్రం కార్యకర్తలు, నాయకులు.. వైముఖ్యంతో ఉన్నారు. సీఎంగా పవన్‌నే చూడాలని జనసేన నాయకులు, కాదు.. తాను చేసిన శపథం మేరకు తమ నాయకుడు చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలని టీడీపీ నాయకులు పట్టుబడుతుండడంతో ఈ రెండు పార్టీల పొత్తుపై అనేక సందేహాలు వచ్చాయి.
ఇక, ఇదేసమయంలో క్షేత్రస్థాయిలో టికెట్లు ఆశించిన జనసేన నాయకుల పరిస్థితి కూడా డోలాయమానం లో పడింది. తమకు టికెట్లు వస్తాయో రావో అని ఇప్పటి వరకు పార్టీ కార్యక్రమాలను భుజాన వేసుకుని నడిపించిన జనసేన నాయకులు.. ఇప్పుడు పొత్తు అనే సరికి మొహం చాటేసిన పరిస్థితి పలు జిల్లాల్లో కనిపించింది. ఈ నేపథ్యంలో ముందుగానే ఈ అసంతృప్తులను, సమన్వయ లేమిని గుర్తించిన రెండు పార్టీలూ.. సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసి చర్యలకు పూనుకొన్నాయి.
ఈ క్రమంలో ఇటు టీడీపీ, అటు జనసేనల తరఫున సంయుక్తంగా సమన్వయ కమిటీలు ఏర్పాటు చేశారు. తాజాగా ఈ సమన్వయ కమిటీ సమావేశం రాజమండ్రిలో జరిగింది. పొత్తుల ప్రాధాన్యాన్ని ఇరు పార్టీల కీలక నేతలకు వివరించడంతోపాటు.. వైసీపీ పాలనతో అధోగతి పాలైన ఆంధ్రప్రదేశ్ తిరిగి కోలుకోవాలంటే టీడీపీ, జనసేన ప్రభుత్వం రావాల్సిందేనని నేతలు సర్దిచెప్పారు. వచ్చే ఎన్నికల్లో క్లీన్ స్విప్ చేసే దిశగా అంతా కలిసి ఉమ్మడిగా పనిచేయాలని తీర్మానించారు.
ఇందుకోసం ఇరుపార్టీల సూపర్ టెన్ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని తీర్మానించారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమన్వయ కమిటీ సమావేశాలు జోరుగా సాగనున్నాయి. ప్రస్తుతం జరిగిన సమన్వయ కమిటీ సమావేశం సుహృద్భావ వాతావరణంలో జరగడం.. ఇప్పటి వరకు ఉన్న సందేహాలు కూడా నివృత్తి కావడంతో జనసేన-టీడీపీలు ఒకింత హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికలకు రెండు మాసాల ముందు అందరూ కలిసి పోవడంఖాయమనే చెబుతున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates