టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. 2024 ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అవుతారని, చంద్రబాబు చస్తాడు అని గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారం రేపాయి. జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ పై ఉన్న చంద్రబాబు భద్రతపై ఇప్పటికే టీడీపీ నేతలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో గోరంట్ల మాధవ్ వ్యాఖ్యలు చంద్రబాబు భద్రతకు భంగం కలిగించేలా ఉన్నాయని టిడిపి నేతలు మండిపడ్డారు.
గోరంట్ల మాధవ్ కామెంట్లపై వైసీపీ నేతలు కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా గోరంట్ల మాధవ్ తన వ్యాఖ్యలపై స్పందించారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని, టీడీపీ వాళ్లకు తప్పుగా కనిపిస్తున్నాయని గోరంట్ల మాధవ్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. చంద్రబాబు రాజకీయంగా సమాధి అవుతారని చెప్పడమే తన ఉద్దేశమని మాధవ్ క్లారిటీనిచ్చే ప్రయత్నం చేశారు. ఉచ్చారణ దోషం వల్ల టీడీపీ నేతలకు అలా అనిపించి ఉండొచ్చని చెప్పుకొచ్చారు.
చంద్రబాబుపై తన వ్యాఖ్యలను వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అయితే, గోరంట్ల మాధవ్ ఇచ్చిన వివరణపై టిడిపి నేతలు సంతృప్తి చెందడం లేదు. నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం, దూషించడం వైసీపీ నేతలకు అలవాటుని, ఆ తర్వాత వ్యాఖ్యలను వక్రీకరించారంటూ కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తుంటారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates