రాబోయే తెలంగాణా ఎన్నికల్లో గెలుపు విషయంలో బీజేపీ వ్యూహం ఏమిటో అర్ధం కావటంలేదు. జనాలను ఆకర్షించేందుకు నిర్దిష్టమైన హామీలు లేవు. ప్రణాళికను ప్రకటించలేదు. మ్యానిఫెస్టో ఎలాగుండబోతోందో సంకేతాలు ఇవ్వలేదు. పోనీ టికెట్లను అయినా ముందుగా ప్రకటించారా అంటే అదీలేదు. ఇప్పటివరకు పూర్తి జాబితానే ప్రకటించలేదు. పట్టుమని 40 నియోజకవర్గాల్లో కూడా గట్టి అభ్యర్ధులు లేని బీజేపీ కూడా అభ్యర్ధుల ఎంపికలో టికెట్ల ప్రకటనలో విపరీతమైన జాప్యం చేస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది.
ఒకవైపు అభ్యర్ధులను ప్రకటించి, ప్రచారంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ దూసుకూపోతోంది. కేసీయార్ అయితే దాదాపు రెండు నెలల క్రితమే 115 నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈమధ్యనే మిగిలిన నలుగురు అభ్యర్ధులను కూడా ప్రకటించారు. అభ్యర్ధులు నియోజకవర్గాల్లో ప్రచారం చేసుకుంటున్నారు, కేసీయార్ బహిరంగసభలు కూడా మొదలుపెట్టేశారు. రోజుకు మూడు నియోజకవర్గాల్లో బహిరంగసభల్లో ప్రసంగిస్తు సుడిగాలి పర్యటనలు చేస్తున్న విషయాన్ని అందరు చూస్తున్నదే.
ఇక కాంగ్రెస్ విషయం చూస్తే ఇప్పటికి 100 నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ప్రకటించింది. మరో రెండు మూడు రోజుల్లో మిగిలిన 19 మంది అభ్యర్ధులను ప్రకటించే అవకాశాలున్నాయని పార్టీవర్గాలు చెబుతున్నాయి. అన్నీ రకాలుగాను బీఆర్ఎస్, కాంగ్రెస్ దూసుకుపోతుంటే బీజేపీలో ఏమి జరుగుతోందో ఎవరికీ అర్ధంకావటంలేదు. నరేంద్రమోడీ, అమిత్ షా ఇన్నిసార్లు తెలంగాణాలో పర్యటించినా పెద్దగా ఉపయోగం కనబడలేదు. అన్నీ నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్ధులు కూడా లేని పార్టీ కూడా అభ్యర్ధుల ప్రకటనకు ఇన్ని రోజులు ఎందుకు సమయం తీసుకుంటోందో తెలీటంలేదు.
జరుగుతున్నది చూస్తుంటే బీఆర్ఎస్ కు మేలు చేసేందుకే బీజేపీ ఇలా వ్యవహరిస్తోందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మూడు పెద్ద పార్టీల అభ్యర్ధులు పోటీలో ఉంటే ఓట్లు చీలిపోయి కాంగ్రెస్ లాభపడుతుందనే ప్రచారం అందరికీ తెలిసిందే. ఓట్లలో చీలిక వచ్చేస్తే అప్పుడు కాంగ్రెస్ లబ్దిపొందుతుందన్న విషయాన్ని బీజేపీ గ్రహించే బీఆర్ఎస్ లాభపడేట్లుగా చేస్తోందనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. అభ్యర్ధుల ప్రకటనను వీలైనంత డిలే చేసి, చివరకు ఎవరినో ఒకరిని బరిలోకి దింపితే అప్పుడు ఫైట్ బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్యే జరుగుతుందని బీజేపీ అంచనా వేస్తున్నట్లుంది. డైరెక్ట్ ఫైట్ లో బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటుందని అంచనా వేసినట్లుంది. అందుకనే ఇలాగ వ్యవహరిస్తోందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates