సమంత సిటాడెల్ ఫట్టా హిట్టా

వరుణ్ ధావన్, సమంతా జంటగా నటించిన సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ ఇటీవలే అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన సంగతి తెలిసిందే. ఆరు ఎపిసోడ్లతో ఒక్కోటి సగటున యాభై నిముషాలు ఉన్న ఈ యాక్షన్ థ్రిల్లర్ మీద ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. రివ్యూస్ కూడా డీసెంట్ గానే వచ్చాయి కానీ ప్రైమ్ ఆశించింది వేరు. తమ సంస్థకు గొప్ప బ్లాక్ బస్టర్స్ గా నిలిచిన ది ఫ్యామిలీ మ్యాన్, మీర్జాపూర్, బ్రీత్ స్థాయిని మించిపోయేలా హిట్టు కొడుతుందని భావించారు. కానీ సిటాడెల్ అంత చెప్పుకునే స్థాయిలో ట్రెండింగ్ కాకపోవడం అభిమానులను నిరాశపరుస్తోంది.

ఇలా జరగడానికి కారణం లేకపోలేదు. దర్శక ద్వయం రాజ్ అండ్ డికెలు తీసుకున్న కథను డ్యూయల్ లేయర్ ఫార్మాట్ లో ప్రతి ఎపిసోడ్ ని వర్తమానం, ఫ్లాష్ బ్యాక్ అంటూ రెండు భాగాలుగా విభజించి చెప్పడం కామన్ ఆడియన్స్ కి అంతగా కనెక్ట్ కాలేదు. స్ట్రెయిట్ నెరేషన్ లో ముందు సామ్, వరుణ్ ల పరిచయం, ప్రేమతో మొదలుపెట్టి తర్వాత విడిపోయే కారణాలు చూపించి శత్రువులు వెంటపడే వైనాన్ని ఇంకొంచెం మోతాదు మించి డిజైన్ చేసి ఉంటే బాగుండేది. కానీ సిటాడెల్ లో ఆ డెప్త్ లేదు. సీన్లు ఫైట్లు వస్తూ వెళ్తుంటాయి తప్పించి మళ్ళీ ఇంకోసారి చూద్దామనిపించే స్థాయిలో లేవు.

పర్వాలేదనిపించుకుంటే వెబ్ సిరీస్ పనవ్వదు. చాలా బాగుందనే టాక్ వస్తేనే జనం అదే పనిగా గంటల తరబడి వాటి మీద సమయాన్ని ఖర్చు పెడతారు. ప్రైమ్ మాత్రం ప్రమోషన్ కోసమే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. రెమ్యునరేషన్లు, బడ్జెట్ లు విపరీతంగా తడిసి మోపెడయ్యాయి. అయినా సరే రాజ్ అండ్ డీకే మీద నమ్మకమే అంత బడ్జెట్ తో రిస్క్ చేయించింది. కాకపోతే యునానిమస్ గా రిపోర్ట్స్ రాకపోవడం దెబ్బేనని చెప్పాలి. ఫలితం సంగతి ఎలా ఉన్నా సమంతాకు మాత్రం స్టంట్లు, నటన, యాక్షన్ ఎపిసోడ్ల పరంగా మంచి పేరు వచ్చింది. వరుణ్ ని పూర్తిగా సైడ్ చేసింది.