వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుల వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలపై, వారి కుటుంబ సభ్యులపై అసభ్యకర పోస్టులు, అశ్లీలకరమైన వ్యాఖ్యలు చేయడంతోనే వారిని చట్ట ప్రకారం అరెస్టు చేస్తున్నామని ప్రభుత్వం, పోలీసులు చెబుతున్నారు. అయితే, ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారన్న కారణంతోనే వారిని అరెస్టు చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. గతంలో తమపై టీడీపీ, జనసేన, బీజేపీ సోషల్ మీడియా కార్యకర్తలు పెట్టిన పోస్టులను అంబటి రాంబాబు, విడదల రజనీ మీడియాకు చూపిస్తున్నారు.
తనపై సోషల్ మీడియాలో గతంలో పోస్టులు పెట్టారని విడదల రజని వ్యాఖ్యానించిన కొద్ది గంటల్లోనే ఆమెకు షాక్ తగిలింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చిలకలూరిపేట అర్బన్ సీఐ తనపై అక్రమ కేసులతో వేధింపులకు పాల్పడ్డారని ఐటీడీపీ చిలకలూరిపేట అధ్యక్షుడు పిల్లి కోటేశ్వరరావు పోలీసులను ఆశ్రయించారు. అంతేకాకుండా ఈ వ్యవహారంపై గుంటూరు ఎస్పీ కంచి శ్రీనివాసరావుకు కోటేశ్వరరావు ఫిర్యాదు చేశారు.
వైసీపీ హయాంలో సోషల్ మీడియాలో మార్ఫింగ్ పోస్టులు పెట్టినట్లుగా తప్పుడు కేసులతో తనను వేధించారని, పోలీస్ స్టేషన్లో అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలకు గురి చేశారని కోటేశ్వరరావు తన ఫిర్యాదులో ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోటేశ్వరావు కోరారు. అయితే, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై సోషల్ మీడియాలో అనుచిత పోస్ట్ పెట్టిన కారణంతో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీసులు విచారణకు పిలిచిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే విడదల రజనిని కూడా ఆ తరహాలో పోలీసులు విచారణకు పిలుస్తారా లేదా అన్నది తేలాల్సి ఉంది. దీంతో, పవన్ చెప్పిన కర్మ కాలింగ్ అని, విడదల రజనికి షాక్ తగిలిందని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates