రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో జనసేనతో పొత్తు పెట్టుకోవటంలో బీజేపీ మాస్టర్ ప్లాన్ వేసిందా ? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తెలంగాణలో జనసేనతో పొత్తు పెట్టుకోవటం ద్వారా ఏపీలో టీడీపీ-జనసేన పొత్తును చిత్తుచేయాలన్నది అసలు ప్లాననే అనుమానాలు పెరిగిపోతున్నాయి. నిజానికి తెలంగాణాలో బీజేపీకి ఎలాంటి బలం లేదు. అధికారంలోకి వచ్చేయటం ఖాయమని కమలనాదులు ఒకటే ఊదరగొడుతున్నా అదంతా డ్రామాలే అని అందరికీ తెలుసు. పట్టుమని 40 నియోజకవర్గాల్లో కూడా గట్టి అభ్యర్ధులను పోటీలోకి దింపలేని పార్టీ అధికారంలోకి వచ్చేస్తుందని చెబితే ఎవరు నమ్ముతారు ?
క్షేత్ర స్ధాయిలో బీజేపీ ఎంత బలహీనంగా ఉందో అర్ధమవుతోంది. ఈ పార్టీ జనసేనతో పొత్తు పెట్టుకోవటంలో అర్ధమేలేదు. ఎందుకంటే బీజేపీ కన్నా జనసేన పరిస్ధితి మరింత అధ్వాన్నంగా ఉంది. ఇలాంటి రెండుపార్టీలు పొత్తు పెట్టుకుంటే ఏమైపోతుంది ? ఏమీకాదని తెలిసినా ఎందుకు పెట్టుకున్నట్లు ? ఎందుకంటే బీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు కాంగ్రెస్ వైపు మళ్ళకుండా చేయటానికే అని సమాచారం. బీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు తమవైపు వచ్చే అవకాశాలు లేవని కమలనాథులకు అర్ధమైందట. అందుకనే వ్యతిరేక ఓట్లు కాంగ్రెస్ వైపు వెళ్ళకుండా సడెన్ గా జనసేనతో పొత్తు పెట్టుకున్నారు.
జనసేన కూడా ఆంధ్రామూలాలున్న పార్టీ కాబట్టి తెలంగాణాలోని సీమాంధ్ర ఓట్లన్నీ గంపగుత్తగా కాంగ్రెస్ వైపు మళ్ళకుండా జనసేనను రంగంలోకి బీజేపీ దింపిందట. ఒకవేళ తమ వ్యూహం ఫలించి జనసేనకు వస్తే నాలుగు సీట్లొస్తాయి లేకపోతే ఇక్కడ ఓటమి ప్రభావం ఏపీలో పడుతుందని బీజేపీ నేతలు ఊహించారు.
తెలంగాణా సీమాంధ్రుల్లో ముఖ్యంగా కమ్మ, కాపు ఓట్లు జనసేనకు పడలేదు కాబట్టి ఏపీలో టీడీపీతో పొత్తు వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని తేల్చేయటమే బీజేపీ నేతల ఆలోచనట. అంటే ఏపీలో టీడీపీ-జనసేన పొత్తును దెబ్బకొట్టడమే ఏకైక లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోందన్న విషయమై అనుమానాలు పెరిగిపోతున్నాయి. మరీ విషయాలు, బీజేపీ వ్యూహాలను జనసేన అధినేత పవన్ కల్యాణ్ గ్రహిస్తున్నారో లేదో ఎవరికీ అర్ధంకావటంలేదు. చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.