తెలంగాణ రాజకీయాల్లో పెనుకుదుపు. ఇప్పటి వరకు ఎవరూ ఊహించని విధంగా ఏకంగా 5 లక్షల 31 వేల 226 కోత్త ఓట్లు నమోదయ్యాయి. ఇవన్నీ కూడా 18 ఏళ్లు నిండిన యువతవే కావడం గమనార్హం. రాష్ట్ర వ్యాప్తం గా ఎన్నికల అధికారులు నమోదు చేసిన కొత్త ఓటర్ల జాబితా తాజాగా బహిర్గతమైంది. వీటిలో నిజామాబాద్, ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, హైదరాబాద్ జిల్లాలకు చెందిన యువతే ఎక్కువగా ఉన్నారు. వీరంతా ఓటేస్తే.. రాష్ట్ర ఎన్నికల ముఖ చిత్రమే మారిపోవడం ఖాయమని పరిశీలకులు చెబుతున్నారు.
కొత్తగా నమోదైన ఓటర్లను తమ వైపు తిప్పుకోవాలనేది ప్రతిపార్టీ చేస్తున్న ప్రయత్నం. ఈ క్రమంలో బీఆర్ ఎస్ ఒకింత దూకుడుగా ఉంది. యువతకు పెద్దపీట వేస్తున్నామని.. ఉద్యోగ కల్పనలో ముందున్నామని.. తాజాగా కేసీఆర్ చెప్పుకొచ్చారు. అదేసమయంలో అనేక విద్యాసంస్థలను నెలకొల్పుతున్నామన్నారు. కేంద్రం సహకరించకపోయినా.. రాష్ట్రంలో వైద్య రంగానికి పెద్దపీట వేశామని.. కళాశాలలు నిర్మిస్తున్నామని చెప్పుకొచ్చారు.
అంతేకాదు.. ఐటీ కంపెనీలు కూడా వరదలా తెలంగాణకు వస్తున్నాయనేది కేసీఆర్ మాట. మొత్తంగా యువతకు పెద్ద ఎత్తున అవకాశాలు కల్పిస్తున్నామని కేసీఆర్ చెప్పకొచ్చారు. అదేసమయంలో కాంగ్రెస్ కూడా యువతను తమవైపు తిప్పుకొనే ప్రయత్నాలు చేస్తోంది. నీళ్లు-నిధులు-నియామకాల పేరిట ఏర్పడిన తెలంగాణలో నియామకాలు.. కేవలం కేసీఆర్ కుటుంబానికి మాత్రమే పరిమితం అయ్యాయని.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. అన్ని వర్గాలకు నియామకాలు చేపడుతుందని హామీలు గుప్పిస్తున్నారు.
ఇక, మేనిఫెస్టోల విషయానికి వస్తే.. ఇక్కడ కూడా..యువతను దృష్టిలో పెట్టుకుని కొన్ని కీలక పథకాలను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఈ దిశగా బీఆర్ ఎస్ ఐటీ వర్గాలను కలిసి.. వారి సమస్యలను తెలుసుకుంటున్నట్టు సమాచారం. అదేవిధంగా విద్యార్థి సంఘాల నాయకులతోనూ తాజాగా ప్రగతి భవన్‌లో నాయకులు కలిసి వారి డిమాండ్లను కూడా తెలుసుకున్నారు. మొత్తంగా చూస్తే.. 5 లక్షల పైచిలుకు ఉన్న కొత్త యువ ఓటర్లను తమవైపు తిప్పుకొనేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తుండడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates