ఓడిస్తే హాయిగా రెస్ట్ తీసుకుంటా: కేసీయార్

కచ్చితంగా ఓడిపోతామని తెలిసినా ఫలితాన్ని అధికారికంగా ప్రకటించేవరకు గెలుస్తామని చెబుతారు ఎవరైనా. అలాంటిది ఇంకా పోటీకూడా మొదలుకాకుండానే ఓడిపోతే ఇబ్బందేమీ లేదని ఎవరైనా అన్నారంటే అర్ధమేంటి ? ఇపుడీ విషయంపైనే తెలంగాణా రాజకీయాల్లో పెద్ద  ఎత్తున చర్చ మొదలైంది. ఇంతకీ విషయం ఏమిటంటే అచ్చంపేట ఎన్నికల బహిరంగసభలో కేసీయార్ మాట్లాడుతున్నపుడు ఓటమి భయం స్పష్టంగా బయటపడింది. ఇంతకీ కేసీయార్ ఏమన్నారంటే రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఓడిస్తే హాయిగా రెస్ట్ తీసుకుంటామన్నారు.

 ఓడిపోయినంత మాత్రాన తమకొచ్చే నష్టమేమీ లేదని కూడా చెప్పారు. బీఆర్ఎస్ ను జనాలు ఓడిస్తే హాయిగా ఫాం హౌస్లో రెస్టు తీసుకుంటామన్నారు. త్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణా కోసం చేయాల్సినంత  చేశామని చెప్పారు. అడ్డం..పొడవు మాటలు మాట్లాడే వాళ్ళ మాటలు నమ్మద్దని కేసీయార్  జనాలకు విజ్ఞప్తి చేశారు. జనాలు పొరబాటున ప్రతిపక్షాలకు అధికారాన్ని అప్పగిస్తే కైలాసం ఆటలో పాము మింగినట్లే అవుతుందని హెచ్చరించారు. ప్రతిపక్షాల మీద పోరాటం చేయాల్సింది బీఆర్ఎస్ కాదని ప్రజలే అని కేసీయార్ చెప్పటమే విచిత్రంగా ఉంది.

అధికారం కోసం ఒకళ్ళతో మరొకళ్ళు పోరాటాలు చేసుకోవాల్సింది రాజకీయ పార్టీలే కానీ జనాలు కాదన్న విషయం అందరికీ తెలిసిందే.  ఎన్నికల్లో గెలుపు, ఓటమి రాజకీయపార్టీలకు సంబంధించిదే కానీ జనాలకు సంబంధించింది కాదు.  కాబట్టి ఎన్నికల్లో ఓడిపోతే బీఆర్ఎస్ ప్రతిపక్షంలో కూర్చుంటుందే కానీ జనాలు కాదు. అధికారం చేజారిపోయేది కూడా బీఆర్ఎస్ కే కానీ జనాలకు కాదని కేసీయార్ కు తెలీదా ?

బీఆర్ఎస్ ను గెలిపించుకోవాల్సిన అవసరం, ప్రతిపక్షాల మీద పోరాడాల్సిన అవసరం జనాలకు ఏమొచ్చింది ? ఇలాంటి మాటలను మాట్లాడటంతోనే కేసీయార్లో ఓటమిభయం బయటపడుతోంది. మొన్నటివరకు కచ్చితంగా గెలిచేది బీఆర్ఎస్సే అని చెప్పిన కేసీయార్ ఇపుడు ఓడిపోయినా వచ్చే నష్టంలేదని అనటంలో అర్ధమేంటి ? పైగా ఫాం  హౌస్ లో హాయిగా రెస్టు తీసుకుంటానని చెప్పటమే విచిత్రంగా ఉంది. గడచిన పదేళ్ళుగా కేసీయార్  చేస్తున్నదిదే. సెక్రటేరియట్ కు ఒకరోజు వస్తే మరో పదిరోజులు ఫాం  హౌస్ లోనే ఉంటున్నారు. అందుకనే జనాలు కూడా కేసీయార్ ను ఫాంహౌజ్ సీఎం అంటున్నది.