జగన్ పాలన నుంచి స్వాతంత్ర్యం కావాలి: భువనేశ్వరి

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును తట్టుకోలేక వందలాది మంది కార్యకర్తలు హఠాన్మరణం పాలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మృతి చెందిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించేందుకు చంద్రబాబు సతీమణి ‘నిజం గెలవాలి’ పేరుతో ఓదార్పు యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రెండో రోజు ఈ ఓదార్పు యాత్ర శ్రీకాళహస్తిలో జరిగింది. ఈ సందర్భంగా తిరుపతిలో జరిగిన బహిరంగ సభలో భువనేశ్వరి ఏపీ ప్రభుత్వంపై, జగన్ పాలనపై నిప్పులు చెరిగారు.

ఆనాడు బ్రిటిష్ వారితో స్వాతంత్ర్య పోరాటం ప్రజలు చేయాల్సి వచ్చిందని, ఈనాడు జగన్ ప్రభుత్వం నుంచి స్వాతంత్ర్యం కోసం ఏపీ ప్రజలు పోరాడాల్సి వస్తోందని భువనేశ్వరి అన్నారు. అన్న ఎన్టీఆర్ పౌరుషం, చంద్రబాబు పోరాట పటిమతో పోరాడదామని, విజయం తథ్యం అని భువనేశ్వరి పిలుపునిచ్చారు.

గతంలో తిరుమలకు ఎప్పుడు వెళ్లినా నలుగురు కుటుంబ సభ్యులం వెళ్లేవారమని, ఇపుడు తాను ఒక్కదాన్నే రావాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు నిర్దోషి అని తాను గ్యారెంటీ ఇస్తున్నానని భువనేశ్వరి అన్నారు. సీఐడీ వారు ఏం విచారణ చేసినా భయపడబోమని, వారు టీడీపీ శ్రేణులను భయపెట్టాలని చూస్తున్నారని అన్నారు. పవన్ తో మాట్లాడినపుడు ఆయన కూడా తమలాగే ఆలోచిస్తున్నారని అర్థమైందని చెప్పారు. రెండు పార్టీలు కలిసి ముందుకు వెళతాయని, లోకేష్ త్వరలోనే పాదయాత్ర మొదలుపెడతారని అన్నారు.

ప్రతిపక్ష నేతలను అరెస్టు చేయడంలో, రాష్ట్రంలో హింసాత్మక వాతావరణం ఏర్పరచడంలో ఈ ప్రభుత్వం ముందుందని దుయ్యబట్టారు. కానీ,పరిశ్రమలను తీసుకురావడంలో మాత్రం వెనుకబడిందని, అందుకే పక్క రాష్ట్రాలకు పరిశ్రమలు తరలివెళుతున్నాయని, ఏపీ యువత ఉద్యోగాల కోసం పొరుగు రాష్ట్రాలకు వలస పోవాల్సిన దుస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.