బీజేపీ కోసం టీడీపీ త్యాగం..

బీజేపీ కోసం టీడీపీ త్యాగం చేస్తోందా? ఆ దిశ‌గా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకోనుందా? ఇదీ.. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోని తెలుగు దేశం పార్టీ నాయ‌కుల మ‌ధ్య జ‌రుగుతున్న సంచ‌ల‌న చ‌ర్చ‌. ఇంత‌కీ ఏం జ‌రుగుతోందంటే.. వ‌చ్చే 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ-జ‌న‌సేన‌తో క‌లిసి పోటీకి వెళ్లాల‌ని టీడీపీ లెక్క‌లు వేసుకుంది. ఈ క్ర‌మంలో జ‌న‌సేన కలిసి వ‌చ్చింది. కానీ, బీజేపీ మాత్రం ఇంకా ఏ నిర్ణ‌యం వెల్ల‌డించ‌లేదు.

ఇదిలావుంటే.. ఏపీలో పొత్తు కోసం ప్ర‌య‌త్నిస్తున్న టీడీపీని త‌మ‌కు అనుకూలంగా మార్చుకునే ప్ర‌క్రియ లో బీజేపీ నేత‌లు సిద్ధ‌మ‌య్యార‌నే ప్ర‌చారం సాగుతోంది. దీనిలో భాగంగా .. తెలంగాణ‌లో టీడీపీ పోటీకి దూరంగా ఉండాల‌నే ష‌ర‌తు విధించార‌ని త‌మ్ముళ్ల మ‌ధ్య చ‌ర్చ సాగుతోంది. ప్ర‌స్తుతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో గెలిచి అధికారంలోకి రావాలని బీజేపీ ఆశ‌లు పెట్టుకుంది. ఈ నేప‌థ్యంలో తెలంగాణ ఎన్నిక‌ల‌పై ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టింది.

త‌మ‌కు అనుకూలంగా ఉన్న అంశాల‌పై అధ్య‌య‌నం చేసిన బీజేపీ నాయ‌కులు.. టీడీపీని దూరంగా ఉంచేలా వ్యూహాత్మ‌కంగా పావులు క‌దిపిన‌ట్టు తెలుస్తోంది. “ఈ ఎన్నిక‌ల్లో మీరు దూరంగా ఉండ‌డం. ఏపీలో మీకు స‌హ‌క‌రిస్తాం” అనే దిశ‌గా బీజేపీ నేత‌లు.. టీడీపీకి ఒక దిశానిర్దేశం చేశార‌ని.. దానికి అనుగుణంగానే టీడీపీ కూడా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీడీపీ దూరంగా ఉంది.

ఇప్ప‌టికే 87 స్థానాల్లో తాము పోటీకి సిద్ధ‌మ‌ని టీ-టీడీపీ చీఫ్ కాసాని జ్ఞానేశ్వ‌ర్ ప్ర‌క‌టించి కూడా వెన‌క్కి త‌గ్గారు. ఇక‌, ఈ ఎన్నిక‌ల్లో టీడీపీ పోటీ కూడా చేయ‌బోద‌ని స్ప‌ష్టంగా తెలుస్తోంది. అంటే.. ఒక ర‌కంగా.. టీడీపీ సానుకూల ఓటు బ్యాంకు ఈ సారి బీజేపీ త‌న‌వైపు తిప్పుకోవాల‌ని భావిస్తోంది. ఒక‌ర‌కంగా.. ఏపీలో బీజేపీతో పొత్తు కోసం.. తెలంగాణ‌లో టీడీపీ పూర్తిగా ఎన్నిక‌ల‌కు దూరంగా ఉండాల్సి రావ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.