జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఇటీవల మీడియా ప్రతినిధులు చిత్ర పరిశ్రమ గురించి పలు ప్రశ్నలు అడిగిన సంగతి తెలిసిందే. రాజకీయాలపై ఇండస్ట్రీకి చెందిన వారు ఎందుకు స్పందించడం లేదని, పవన్ కు మద్దతుగా ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. అయితే, తనకు మద్దతుగా స్పందించిన వారిపై వైసీపీ నేతలు విమర్శలు చేసే అవకాశముందని, రజనీకాంత్ వంటి సూపర్ స్టార్ కే ఆ విమర్శలు తప్పలేదని పవన్ అన్నారు.
ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్ లో ‘మహా మ్యాక్స్’ న్యూస్ చానల్ ప్రారంభోత్సవానికి హాజరైన సందర్భంగా పవన్ కు అదే తరహా ప్రశ్న మరోసారి ఎదురైంది. చంద్రబాబు అరెస్టు, తదనంతర పరిణామాలపై ఇండస్ట్రీ స్పందించకపోవడంపై పవన్ ను కొందరు మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. అయితే, ప్రపంచంలో జరిగే ప్రతి విషయానికి ఇండస్ట్రీ స్పందించాలని కోరుకోవడం సరి కాదని పవన్ అన్నారు. అలా స్పందించడం తేలికైన విషయం కాదని పవన్ అన్నారు.
చిత్ర పరిశ్రమలోని వ్యక్తులు కళాకారులే అని, రాజకీయ నాయకులు కాదని, ఈ విషయాన్ని గుర్తించాలని పవన్ చెప్పారు. రజనీకాంత్ వంటి వారూ రాజకీయాలపై మాట్లాడలేరని, మాట్లాడితే ఇబ్బందికర పరిస్థితులు ఎదురైన సంగతి తెలిసిందేనని అన్నారు. జీవితంలో వినోదం అత్యంత ముఖ్యమైనదని, అందులో సినిమాది అగ్రస్థానం అని పవన్ అభిప్రాయపడ్డారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates