ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. నవంబరు 7వ తేదీ నుంచి నామినేషన్ల ఘట్టం కూడా ప్రారంభమైంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం, ఛత్తీస్‌గఢ్ సహా తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల కోలాహలం కూడా ప్రారంభమైంది. ప్రధాన పార్టీలన్నీ కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. తెలంగాణ మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్-బీజేపీల మధ్యే ఎన్నికల పోరు సాగుతోంది.
తెలంగాణలో త్రిముఖ పోరు ఉంటుందని ఆది నుంచి అందరూ అంచనా వేశారు. అధికార పార్టీ బీఆర్ ఎస్, ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల మధ్య ఎన్నికల పోరు రసవత్తరంగా ఉంటుందని భావించారు. అయితే.. ఆది నుంచి కూడా అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నించిన బీజేపీ.. తాజాగా తన స్ట్రాటజీ మార్చుకున్నట్టు కనిపిస్తోంది. ఈ సారికి తెలంగాణలో గౌరవ ప్రదమైన స్థానాలకే ఈ పార్టీ పరిమితం కానున్నట్టు తెలుస్తోంది.
కేంద్ర మంత్రులు, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన.. తాజాగా జరిగిన రహస్య సమావేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ప్రత్యేకంగా చర్చించారని తెలిసింది. వీటిలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లను బీజేపీ నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ను ఓడించడం, ఇప్పటికే అధికారంలో ఉన్న మిజోరాం(మిత్రపక్షంతో కలిసి ఇక్కడ బీజేపీ పాలన చేస్తోంది), మధ్యప్రదేశ్ లలో తమ అధికారాన్ని పదిలం చేసుకునేందుకు బీజేపీ నిర్ణయించింది.
ఇక, తెలంగాణ విషయానికి వస్తే.. ఇప్పటికే బీజేపీ పెద్దలు రహస్యంగా రెండు సర్వేలు చేయించుకున్నా రు. ఈ రెండు సర్వేల్లోనూ పార్టీకి సానుకూల పవనాలు రాలేదు. ఇక, గత కొన్నాళ్లుగా వస్తున్న వివిధ సర్వేలు కూడా బీజేపీకి సానుకూల పరిణామాలు కనిపించడం లేదని.. 10 లోపు సీట్లు వస్తే.. గగనమేనని స్పష్టం చేస్తున్నాయి. ఈ పరిణామాలపై తాజాగా చర్చించిన మోడీ బృందం.. ఈసారికి తెలంగాణపై పెద్దగా ఫోకస్ చేయకుండా.. కీలకమైన నాలుగు రాష్ట్రాలపైనే దృష్టి పెట్టాలని నిర్ణయించినట్టు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.
పార్లమెంటు ఎన్నికల వేళ.. నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ బలపడితే.. అది ఉత్తరాదిన తమ గెలుపును ప్రభావితం చేస్తుందని కమల నాథులు ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు లేని చోట వెతుక్కోవడం కంటే.. ఉన్న రాష్ట్రాలను నిలబెట్టుకోవడం, అధికారం అంచుల్లో ఉన్న రాష్ట్రాలను దక్కించుకోవడం వంటి వ్యూహంతో ముందుకు సాగాలని నిర్ణయించినట్టు తెలిసింది. దీంతో తెలంగాణలో పోటీ చేస్తున్నా.. కీలక నాయకుల పర్యటనలు మాత్రం చాలా స్వల్పంగా ఉండే అవకాశం కనిపిస్తోందని అంటున్నారు. మొత్తానికి తెలంగాణలో త్రిముఖ పోరు ఉంటుందని అనుకున్నా ఇప్పుడు మారుతున్న పరిణామాల నేపథ్యంలో ద్విముఖ పోరుకే పరిమితం అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.