టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎవరికీ తలవంచబోరని, తల దించబోరని ఆ పార్టీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ అన్నారు. టీడీపీలో సంక్షోభం కొత్తకాదన్నారు. తాజాగా ఆయన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో నారా లోకేష్ మాట్లాడారు. “నా కలలో కూడా ఇటువంటి పరిస్థితి వస్తుంది అని ఊహించలేదు. గతంలో ఏ కష్టం వచ్చినా మన అధినేతలు ఎన్టీఆర్, చంద్రబాబు ముందుండి పోరాడేవారు. అయితే, నాటి పోరాటం వేరు, నేడు మనం చేసే పోరాటం వేరు. ఇప్పడు సైకో జగన్ అనే రాక్షసుడితో పోరాడుతున్నాం” అని లోకేష్ అన్నారు.
తన కుటుంబాన్ని వదిలి ప్రజల కోసమే 45 ఏళ్లు పనిచేసిన నిస్వార్థ సేవకుడు చంద్రబాబుని వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ 43 రోజులు జైల్లో నిర్బంధించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనని ములాఖత్‌లలో కలిసినప్పుడు ఆయన నీతి- నిజాయితీతో కూడిన ధైర్యం కనిపించిందని తెలిపారు. శాంతియుతంగా పోరాడండి, అరాచకపాలనని అంతమొందించేందుకు ప్రజల్ని చైతన్యం చేయండి అని పిలుపునిచ్చినట్టు చెప్పారు. సైకో జగన్ విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని కాపాడటానికి చంద్రబాబు- పవన్ కళ్యాణ్ కలిసి పోరాడాలని నిశ్చయించుకున్నారని నారా లోకేష్ చెప్పారు.
టిడిపి-జనసేన కూటమికి 160 సీట్లు
టీడీపీ-జనసేన కూటమి వచ్చే ఎన్నికల్లో 160 స్థానాల్లో విజయం దక్కించుకోవడం ఖాయమని నారా లోకేష్ చెప్పారు. కష్టాల్లో ఉన్న ప్రజలకి భరోసా ఇచ్చేందుకు చంద్రబాబు ప్రారంభించిన బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకి గ్యారెంటీ నవంబర్ ఒకటి నుంచి రాష్ట్రమంతా ప్రారంభం కానుందతెలిపారు. చంద్రబాబు అక్రమ అరెస్టుపై ఆవేదనతో అశువులు బాసిన అభిమానుల కుటుంబాలని పరామర్శించి అండగా నిలిచేందుకు నారా భువనేశ్వరి త్వరలోనే “నిజం గెలవాలి” అనే కార్యక్రమం ద్వారా మృతుల కుటుంబీకులను పరామర్శిస్తారని వివరించారు.
బాబు రాగానే యువగళం
చంద్రబాబు జైలు నుంచి బయటకు రాగానే తన యువగళం పాదయాత్ర పునః ప్రారంభం అవుతుందని నారా లోకేష్ చెప్పారు. ఎక్కడ యాత్రను ఆపామో అక్కడి నుంచి పాదయాత్ర ప్రారంభం అవుతుందని తెలిపారు. యాత్రకు వచ్చిన జోష్‌తో వైసీపీ నేతలు అనేక కుట్రలు పన్నారని, అయినా వాటిని ఛేదించుకుని ముందుకుసాగామని నారా లోకేష్ వివరించారు.