ప్రస్తుత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొన్ని సీట్లను కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. అయితే.. ఖరారు చేయని సీట్లే ఇప్పుడు పార్టీకి తలకు మించిన భారంగా మారుతున్నాయి. ఇక్కడ ఒక్కొక్క స్థానం నుంచి ముగ్గురేసి చొప్పున కొన్ని స్థానాల్లో అంతకు మించి నాయకులు నువ్వా-నేనా అనిపోటీ పడుతున్నారు. అయితే, వీరికి కీలక నేతల అండదండలు ఉండడం.. ఢిల్లీ స్థాయిలో సిఫారసులు కూడా కొనసాగుతుండడంతో ఎవరికి టికెట్ కేటాయించాలన్న విషయంపై పార్టీ నాయకులు తలలు పట్టుకుంటున్నారు.
అశ్వారావుపేట
కీలకమైన అశ్వారావుపేట టికెట్ కోసం.. ముగ్గురు పోటీ పడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, జడ్పీటీసీ సున్నం నాగమణి, జాడే ఆదినారాయణ రేసులో ముందున్నారు. వీరిలో తాటి వెంకటేశ్వర్లుకు పీసీసీ చీఫ్ రేవంతరెడ్డి అండ ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇక, సున్నం నాగమణికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, జాడే ఆదినారాయణకు మాజీ ఎంపీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి మద్దతు ఇస్తున్నారు. దీంతో ఈ ముగ్గురూ తమకే టికెట్ దక్కుతుందని ఆశలు పెట్టుకున్నారు.
వైరా..
ఈ నియోజకవర్గం నుంచి నలుగురు కీలక నాయకులు టికెట్‌లు ఆశిస్తున్నారు. మాలోతు రాందాసు నాయక్, బానోతు విజయాబాయి, బానోతు బాలాజీనాయక్, ధరావత రామ్మూర్తినాయక్ టికెట్ల రేసులో పరుగులు పెడుతున్నారు. వీరిలో ముగ్గురు నేతలకు పెద్ద నాయకుల అండ ఉంది. రాందాస్ నాయక్, బాలాజీనాయక్‌కు సీఎల్పీనేత భట్టి విక్రమార్క, రామ్మూర్తినాయక్ కు కేంద్ర మాజీమంత్రి, ఫైర్ బ్రాండ్ రేణుకాచౌదరి దన్నుగా ఉన్నారు. ఇక, విజయాబాయి పేరును పొంగులేటి సుధాకర్‌రెడ్డి సూచిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ ఎవరికి టికెట్ ఇస్తుందో చూడాలి.
సత్తుపల్లి..
ఈ స్థానం నుంచి ఏకంగా ఐదుగురు పోటీలో ఉన్నారు. మాజీమంత్రి సంబాని చంద్రశేఖర్, మట్టా రాగమయి, కొండూరు సుధాకర్, వక్కలగడ్డ సోమచంద్రశేఖర్, మానవతారాయ్ లు టికెట్లు ఆశిస్తున్నారు. మాజీ మంత్రి సంబాని చంద్రశేఖర్ తనకు ఈసారి అవకాశం ఇవ్వాలని గట్టిగా పట్టుబడుతుండగా కొండూరు సుధార్‌కు టికెట్ ఇవ్వాలని పొంగులేటి పట్టుబడుతున్నారు. రాగమయికి టికెట్ ఇవ్వాల్సిందేనని రేణుకాచౌదరి అంటున్నారు.
ఇల్లెందు..
ఇల్లెందు స్థానానికి కూడా కాంగ్రెస్‌నేతలు గట్టిపోటీ ఇస్తున్నారు. జడ్పీచైర్మన్ కోరం కనకయ్యకు టికెట్ ఇవ్వాలని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గట్టి పట్టు పడుతున్నారు. ఇక్కడ మరో నలుగురు కీలకంగా మారారు. వీరంతా టికెట్ల కోసం ఎదురు చూస్తున్నారు.
పినపాక..
ఈ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, మాజీ జడ్పీటీసీ గాంధీతోపాటు చందా సంతోష్ టికెట్ కోసం కుస్తీ పడుతున్నారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాయం వెంకటేశ్వర్లుకి గట్టి మద్దతు ఇస్తుండగా.. భట్టి విక్రమార్క తనకు టికెట్ ఇప్పిస్తారని గాంధీ చెబుతున్నారు. మొత్తానికి టికెట్ల వ్యవహరం కాంగ్రెస్‌లో తలనొప్పిగా మారింది.