సైకిల్ తొక్కినా నేర‌మేనా?! : లోకేష్ ఫైర్‌

వైసీపీ ముఖ్య‌నాయ‌కుడు, మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి సొంత నియోజ‌క‌వ‌ర్గం పుంగ‌నూరులో టీడీపీ సానుభూతిప‌రుల‌పై జ‌రిగిన దౌర్జ‌న్యం.. రాష్ట్ర వ్యాప్తంగా క‌ల‌క‌లం సృష్టించింది. శ్రీకాకుళం నుంచి కుప్పం వ‌ర‌కు చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తుగా సైకిల్ ర్యాలీ చేప‌ట్టిన టీడీపీ సానుభూతి ప‌రుల‌పై పెద్దిరెడ్డి గ్యాంగ్ రెచ్చిపోయింది. వారిని అర్థ‌న‌గ్నంగా నిల‌బెట్టి.. నానా బూతులు తిడుతూ.. బెదిరింపుల‌కు గురి చేసింది.

అంతేకాదు.. ఈ ఉదంతం మొత్తాన్నీ.. వీడియో తీయించి సోష‌ల్ మీడియాలో పెద్దిరెడ్డి ముఠా పోస్టు చేయించింది. ఈ వీడియో క్ష‌ణాల్లోనే వైర‌ల్ అయింది. దీనిపై పార్టీల‌కు అతీతంగా అంద‌రూ ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. అంతేకాదు.. విమ‌ర్శ‌లు కూడా గుప్పిస్తున్నారు. ఇక‌, ఈ దాష్టీకంపై టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ తీవ్ర‌స్థాయిలో నిప్పులు చెరిగారు.

“సైకో పాలనలో సైకిల్ తొక్కినా నేరమే! పాపాల పెద్దిరెడ్డి అరాచకాలకు అడ్డుఅదుపు లేకుండా పోయింది. అహంకారం నెత్తికెక్కిన పెద్దిరెడ్డి అనుచరుడు సూరి.. పుంగనూరు మండలం సుగాలిమిట్ట వద్ద శ్రీకాకుళం నుండి కుప్పం వరకూ సైకిల్ యాత్ర చేస్తున్న టిడిపి కార్యకర్తల చొక్కాలు విప్పించి, జెండాలు పీకి దాడికి పాల్పడ్డాడు. బాబుతో నేను అంటూ సైకిల్ యాత్ర చేస్తున్న టిడిపి కార్యకర్తల పై పెద్దిరెడ్డి రౌడీ గ్యాంగ్ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా” అని నారా లోకేష్ పేర్కొన్నారు.

అంతేకాదు, ప్రజలు అధికారం ఇచ్చింది టిడిపి కార్యకర్తల చొక్కాలు విప్పించడానికా? అని లోకేష్ నిల‌దీశారు. జెండాలు పీకడానికా జగన్? అని నిల‌దీశారు. వచ్చే ఎన్నికల్లో వైసిపి నాయకుల చొక్కాలు విప్పి నడిరోడ్డు పై నిలబెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని నారా లోకేష్ హెచ్చ‌రించారు. మ‌రి దీనిపై పెద్దిరెడ్డి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఇదిలావుంటే.. గ‌త వారం పుంగ‌నూరులో నిర్వ‌హించిన ఓ స‌మావేశంలో.. పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో అంద‌రూ ప్ర‌శాంతంగా ఉన్నార‌ని, ఎక్క‌డా ఎలాంటి శాంతి భ‌ద్ర‌త‌ల‌కు ముప్పులేద‌ని వ్యాఖ్యానించ‌డం కొస‌మెరుపు.