టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈ రోజు సుప్రీం కోర్టులో ఊరట లభించలేదు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో క్వాష్ పిటిషన్ పై ఈ రోజు తీర్పు వస్తుందని ఆశించిన చంద్రబాబు, టీడీపీ నేతలు, కార్యకర్తలకు నిరాశ తప్పలేదు. క్వాష్ పిటిషన్ పై తీర్పును సుప్రీం కోర్టు నవంబరు 8వ తేదీకి వాయిదా వేసింది. అక్టోబర్ 21 నుంచి 29 వరకు సుప్రీం కోర్టుకు దసరా సెలవులు. ఈ కేసులో ఇరు పక్షాలు లిఖిత పూర్వక వాదనలు దాఖలు చేయటానికి అక్టోబర్ 20 చివరి రోజు. దీంతో, ముందుగా ప్రకటించిన ప్రకారం ఈ రోజు తీర్పు కచ్చితంగా వస్తుందని అంతా అనుకున్నారు.
మరోవైపు, విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబుకు స్వల్ప ఊరట లభించింది. జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న చంద్రబాబుకు రోజుకు 2 లీగల్ ములాఖత్ లు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల ప్రకారం జైలు అధికారులకు రేపటి నుంచి చంద్రబాబుకు రెండు ములాఖత్ లు ఇవ్వనున్నారు. అంతకుముందు, ప్రతివాదుల పేర్లు చేర్చనందున ఈ పిటిషన్ పై ఇప్పుడు విచారణ అవసరం లేదని మధ్యాహ్నం న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. రోజుకు ఒకసారి మాత్రమే న్యాయవాదులకు ములాఖత్ అవకాశం ఇస్తామని కోర్టు స్పష్టం చేసింది.
అయితే, ములాఖత్ ల సంఖ్య మూడుకు పెంచాలని చంద్రబాబు తరపు లాయర్లు మరోసారి పిటిషన్ వేశారు. దీంతో, రోజుకు రెండు లీగల్ ములాఖత్ లకు అనుమతిస్తూ కోర్టు ఆదేశాలను జారీ చేసింది. లాయర్లకు రోజుకు ఒకసారి మాత్రమే అవకాశం ఇస్తున్నారని, కనీసం మూడు సార్లు అవకాశమివ్వాలని, ప్రతి ములాఖాత్ కనీసం 45 నుంచి 50 నిమిషాల పాటు ఉండేలా అనుమతించాలని చంద్రబాబు లాయర్లు కోర్టును కోరడంతో ఏసీబీ కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.