టీడీపీతో క‌లిసి ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని ప్ర‌జ‌లే కోరుతున్నారు: ప‌వ‌న్

వ‌చ్చే 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల విష‌యంలో తాను తీసుకున్న నిర్ణ‌యం.. త‌న‌ది కాద‌ని, ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చిన స్పంద‌న‌ను అనుస‌రించి తీసుకున్న నిర్ణ‌యమ‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్యాఖ్యానించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీతో క‌లిసి జ‌న‌సేన ఎన్నిక‌ల‌కు వెళ్తుంద‌ని ఆయ‌న గ‌తంలోనే వ్యాఖ్యానించారు. ఈ నేప‌థ్యంలో పార్టీలో ఏర్ప‌డిన స్తబ్ద‌త‌, కీల‌క నేత‌ల మ‌ధ్య జ‌రుగుతున్న మంత‌నాల నేప‌థ్యంలో ఆయా స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాజాగా మంగ‌ళ‌గిరిలో త‌న పార్టీ నేత‌ల‌తో భేటీ అయ్యారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న పొత్తుల విష‌యాన్ని ప్ర‌ధానంగా చ‌ర్చించారు. టీడీపీతో క‌లిసి ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌నే నిర్ణ‌యం త‌న‌దికాద‌ని.. ప్ర‌జ‌లే కోరుకుంటున్నార‌ని ఇప్పుడు ఏపీకి ఆ అవ‌స‌రం ఉంద‌ని పవ‌న్ వ్యాఖ్యానించారు. పార్టీకి ఆరున్న‌ర ల‌క్ష‌ల మంది క్రియాశీల స‌భ్యులు ఉన్నార‌న్న ఆయ‌న.. ప్ర‌జ‌ల భ‌విత‌ను బంగారు మ‌యం చేసే బాధ్య‌త త‌న‌తోపాటు వీరంద‌రిపైనా ఉంద‌ని చెప్పారు. టీడీపీ-జ‌న‌సేన పొత్తుల విష‌యాన్ని తాను అనేక కోణాల్లో ప‌రిశీల‌న చేశాన‌ని ప‌వ‌న్ చెప్పారు. అనేక స‌ర్వేలు తెప్పించుకున్నాకే పొత్తుల విష‌యాన్ని ప్ర‌క‌టించిన‌ట్టు తెలిపారు.

ఎవ‌రు ఎన్ని చెప్పినా.. ఎవ‌రు వ‌చ్చినా రాకున్నా.. టీడీపీతోనే త‌న ప్ర‌యాణం ఉంటుంద‌ని ప‌వ‌న్ తెల్చి చెప్పారు. చిన్న చిన్న ఇబ్బందులు ఈ ప్ర‌యాణంలో స‌హ‌జ‌మేన‌ని, అయినా వాటిని దాటుకుని ముందుకు సాగుతామ‌ని తెలిపారు. రాష్ట్రంలో వైసీపీ పోవాల‌నే ఏకేక నినాదంతోనే అంద‌రూ క‌ల‌సి ప‌నిచేయాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. టీడీపీ-జ‌న‌సేన ప్ర‌భుత్వం ఏర్ప‌డితే.. ప‌ద‌వులు.. పీఠాలు.. త‌ర్వాత ఆలో చిస్తామ‌ని చెప్పారు.

సీఎం సీటుపై..
ముఖ్య‌మంత్రి ప‌ద‌విపైనా ప‌వ‌న్ వ్యాఖ్య‌లు చేశారు. ముఖ్య‌మంత్రి పీఠం ఇస్తామంటే నేనువ‌ద్దంటానా? అని అన్నారు. అయితే.. దాని కోసం ఎవ‌రితోనూ గొడ‌వ పెట్టుకోన‌ని.. దాని కోస‌మే తాను వెంపర్లాడ‌డ‌ని తేల్చి చెప్పారు. సీఎంగా అవకాశం ఇస్తే తప్పకుండా తీసుకుంటామ‌ని, అయితే.. ముందుగా రాష్ట్రంలో వైసీపీ ప్ర‌భుత్వం పోవాల‌నే సంక‌ల్పంతోనే అంద‌రూ క‌ల‌సి ప‌నిచేయాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. అనంత‌రం .. జనసేన క్రియాశీల సభ్యులకు ప‌లు బాధ్య‌త‌లు, ప‌ద‌వులు అప్పగిస్తూ నియామక పత్రాలను పవన్ అందించారు.