బ్రాహ్మణి కాకుండా భువనేశ్వరే ఎందుకు?

టీడీపీ అధినేత చంద్రబాబు జైలుకు వెళ్లడం.. రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన.. రోజుల వ్యవధిలోనే తిరిగి వస్తారని భావించినా.. అలాంటి వాతావరణం కనిపించని పరిస్థితి. చంద్రబాబు అరెస్టు వేళ కంటే కూడా.. ఆ తర్వాతే ప్రజల నుంచి స్పందన వచ్చిందన్న మాట వినిపిస్తోంది. అంతకంతకూ చంద్రబాబును విడుదల చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది. మరోవైపు చంద్రబాబు అరెస్టు వేళ.. ఆవేదనతో మరణించిన అభిమానుల కుటుంబాల్ని పరామర్శించడం ద్వారా నైతిక స్థైర్యాన్ని పెంచటంతో పాటు.. పార్టీ కార్యక్రమాలు చేపట్టే వీలుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇందులో భాగంగా చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని తెర మీదకు తీసుకు రావడం ఆసక్తికరంగా మారింది.

బాబు అరెస్టు వేళ.. వారి ఫ్యామిలీ నుంచి బ్రాహ్మణిని తెర మీదకు తెస్తారన్న ప్రచారం జోరుగా సాగింది. తాజాగా చూస్తే.. ఆమెకు బదులుగా భువనేశ్వరితో ప్రోగ్రాం డిజైన్ చేయటం ఆసక్తికరంగా మారింది. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. బ్రాహ్మణి విషయంలో తొందరపాటు సరికాదని.. ఆమె లాంచింగ్ కు ఇది సరైన సమయం కాదంటున్నారు. బాబు అరెస్టు ఎపిసోడ్ లో.. బ్రాహ్మణి.. భువనేశ్వరి మాటల్ని చూసినోళ్లు.. భువనేశ్వరి నోటి నుంచి వచ్చిన మాటలకు కనెక్టు అయినట్లుగా చెబుతున్నారు.

దీనికి తోడు ఎన్టీఆర్ కుమార్తె అన్న సెంటిమెంట్ తో పాటు.. ఆమెకున్న క్లీన్ చిట్ ప్రజల్లో వెళ్లేందుకు.. మరింత కష్టపడేందుకు వీలు కలుగుతుందని చెబుతున్నారు. ఇక.. బ్రాహ్మణి ని ఆఖరి అస్త్రంగా వాడాలన్న ఉద్దేశంతో రిజర్వు చేసి ఉంచినట్లుగా తెలుస్తోంది. వెంటనే ఏదైనా అవసరమైన వేళ.. బ్రాహ్మణిని కూడా రంగంలోకి దించుతారని చెబుతున్నారు. భువనేశ్వరి వాగ్దాటి.. చంద్రబాబు జైల్లో ఉన్న వేళ.. ఆయన సతీమణిగా ఉన్న భువనేశ్వరి పట్ల సానుభూతి ఉంటుంది. ఈ కారణంతోనే.. తాజా ప్రోగ్రాంను ఆమెతోనే డిజైన్ చేసినట్లుగా చెబుతున్నారు. ఈ కారణంతోనే బ్రాహ్మణికి కాస్తంత దూరాన ఉంచి.. భువనేశ్వరిని గోదాలోకి దింపుతున్నట్లుగా చెబుతున్నారు. మరి.. తెలుగు తమ్ముళ్ల ఆలోచనలు ఎంతమేర వర్కువుట్ అవుతాయో చూడాలి.

ఇక ‘నిజం గెలవాలి’ పేరుతో నిర్వహించనున్న యాత్రలో చంద్రబాబు అరెస్టు తర్వాత దాదాపు 105 మంది పార్టీ అభిమానులు.. నేతలు మరణించారని వారిని.. పరామర్శించి.. ధైర్యం చెప్పాలన్నది పార్టీ ఆలోచనగా చెబుతున్నారు. జోన్ కు ఒకటి చొప్పున ఐదు జోన్లలో నిర్వహించే సభల్లో భువనేశ్వరి పాల్గొంటారని చెబుతున్నారు. మరోవైపు లోకేశ్ కూడా భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించాలని భావిస్తున్నారు.
అయితే.. నిజం గెలావాలని అన్న ప్రోగ్రాంను ఎప్పుడు నిర్వహించాలన్న దానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అదే సమయంలో టీడీపీ శ్రేణులు.. ఎవరికి వారు ప్రతి ఇంటికి వెళ్లి.. ‘బాబుతో నేను’ కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరుతున్నారు. ఇలా చేయటం ద్వారా ప్రజల్లో బాబు అరెస్టు వెనుకున్న కుట్రను మరింత వివరంగా చెప్పే వీలు ఉంటుందని చెబుతున్నారు.