తెలంగాణ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. “గుర్రం ఎగరావొచ్చు.. నేను సీఎం కానూ వచ్చు.. ఎవరు మాత్రం చెప్పగలరు” అని ఆయన ఆసక్తిగా వ్యాఖ్యానించారు. సుమారు 50 ఏళ్లకుపైగా రాజకీయా ల్లో ఉన్న జానారెడ్డి తొలుత టీడీపీలో రాజకీయ పాఠాలు నేర్చారు. అన్నగారు ఎన్టీఆర్ హయాంలోనే ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తర్వాత..అనూహ్య పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ బాట పట్టారు. ఈ పార్టీలోనూ అనేక కీలక పదవులు చేపట్టారు. వైఎస్ హయాంలో హోం మంత్రిగా పనిచేశారు.
నల్లగొండ జిల్లాకు చెందిన కుందూరు జానా రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ అసంతృప్తుల బుజ్జగింపుల కమిటీ కి చైర్మన్‌గా ఉన్నారు. సాగర్ నియోజకవర్గం టికెట్‌ను ఆయన కుమారుడికి ఇప్పించుకున్నారు. అయితే.. తాజాగా ఆయన మనసులో మాట చెప్పుకొచ్చారు. ప్రజల హృదయాల్లో తాను ముఖ్యమంత్రి కావాలని ఉందని జానారెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా గుర్రంపోడులో నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
“నాకు నేనుగా ఏ పదవీ కోరుకోవట్లేదు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం హఠాత్తుగా రావచ్చేమో. ఏ పదవి వచ్చినా కాదనను. ఏ ముఖ్యమంత్రి, ఏ నాయకుడు ఇప్పటి వరకు చేయనన్ని శాఖలు నేను చేశా. మంత్రిగా అనేక శాఖలు చూశా. యువకుడిగా ఉన్నప్పుడు 21 ఏళ్లకే రాజకీయాల్లోకి వచ్చా. 36 ఏళ్లకే మంత్రిని అయ్యా. నాకు 55 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది. నాకు ఏ పదవులైనా వాటంతట అవే వస్తాయి. ముఖ్యమంత్రి కావాలనేది ప్రజల ఇష్టం” అని జానారెడ్డి వ్యాఖ్యానించారు. అయితే.. ఇది ఆయన మనసులో మాటేనని కాంగ్రెస్ నాయకులు గుసగుసలాడుతున్నారు.