బీఆర్ఎస్ కు షాక్.. బోథ్ ఎమ్మెల్యే ఔట్!

ఎన్నికల సమరంలో దూసుకెళ్తోన్న బీఆర్ఎస్ కు మధ్యలో స్పీడ్ బ్రేకర్లు తగులుతూనే ఉన్నాయి. పార్టీలో అసంత్రుప్తి బీఆర్ఎస్ కు తలనొప్పిగా మారుతోందని చెప్పాలి. టికెట్లు దక్కని నేతలను బుజ్జగించే ప్రయత్నాలు ఫలితాలను ఇవ్వడం లేదు. బీఆర్ఎస్ ను వీడే నాయకుల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. తాజాగా బీఆర్ఎస్ బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలవడం చర్చనీయాంశంగా మారింది. దీంతో బీఆర్ఎస్ ను వీడి బాపూరావు కాంగ్రెస్ లోకి వెళ్లడం ఖాయమైందనే చెప్పాలి.

ముందుగానే 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్ ఎన్నికల వేడిని రాజేశారు. ఇందులో కొంతమంది సిట్టింగ్ లకు మరోసారి అవకాశం ఇచ్చేందుకు కేసీఆర్ నిరాకరించారు. ఈ టికెట్లు దక్కని జాబితాలో రాథోడ్ బాపూరావు కూడా ఉన్నారు. వరుసగా రెండు సార్లు గెలిచిన బాపూరావును కాదని నేరడిగొండ జడ్పీటీసీ అనిల్ జాదవ్ కు కేసీఆర్ టికెట్ ఇచ్చారు. దీంతో బాపూరావు తీవ్ర అసంత్రుప్తి వ్యక్తం చేశారు. పార్టీ కోసం పనిచేసే నాయకులను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు కేటీఆర్ బుజ్జగించడంతో బాపూరావు సైలెంట్ అయ్యారనే వ్యాఖ్యలు వినిపించాయి.

కానీ టికెట్ దక్కలేదని బీఆర్ఎస్ పార్టీ, అధినేత కేసీఆర్ పై కోపంతో ఉన్న బాపూరావు ఇప్పుడు కారు దిగేందుకు సిద్ధమయ్యారనే చెప్పాలి. తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో ఆయన సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది. భవిష్యత్ పరిణామాలపై రేవంత్ తో బాపూరావు చర్చించినట్లు తెలిసింది. రేవంత్ హామీ మేరకు కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు బాపూరావు సిద్ధమయ్యారని టాక్. ములుగు జిల్లా రామాజపురంలో జరిగే కాంగ్రెస్ బహిరంగ సభలో బాపూరావు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే ఆస్కారముందని తెలిసింది.