తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తాజాగా కాంగ్రెస్ పార్టీ తన వ్యూహాన్ని మార్చుకుంది. అధికార పార్టీకి షాక్ ఇస్తూ.. అదేసమయంలో తాను అధికారంలోకి వచ్చేందుకు ఉన్న మార్గాలను సుగమం చేసుకుంటూ.. కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో 28 శాతం సీట్లను బీసీలకు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ క్రమంలో తాజాగా విడుదల చేసిన.. జాబితాలో మెజారిటీ సీట్లను వారికే కేటాయించడం గమనార్హం.
తాజాగా కాంగ్రెస్ పార్టీ 32 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేస్తూ.. ఓ జాబితాను విడుదల చేసింది. వాస్తవానికి వంద సీట్లలో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేసిన స్ర్కీనింగ్ కమిటీ.. 72 సీట్లలో అభ్యర్థులపై ఏకాభిప్రాయానికి వచ్చింది. అయితే బీసీల సీట్లను పెంచాలంటూ అధిష్ఠానం నిర్ణయించిన నేపథ్యంలో ఆ 72 సీట్లలో సుమారు 22 స్థానాలను కేవలం బీసీ సామాజిక వర్గానికే కేటాయించనుంది. తాజాగా విడుల చేసిన 32 మందితో కూడిన అభ్యర్థుల జాబితాలో ఇదే పరంపర కనిపించింది.
వాస్తవానికి తెలంగాణ కాంగ్రెస్ అంటే.. రెడ్డి
ఆధిపత్యం ఎక్కువనే ముద్ర పడింది. పదువులు, పీఠాలు అన్నీ కూడా ఈ సామాజికవర్గానికే దక్కుతున్నాయనే ప్రచారం కూడా జరుగుతోంది. వాస్తవ పరిస్థితి కూడా అలానే ఉంది. దీంతో ఇప్పుడు అధికార పార్టీ బీఆర్ ఎస్ వ్యూహాత్మకంగా కాంగ్రెస్‌ను దెబ్బకొట్టేందుకు బీసీ జపం చేస్తోంది. కాంగ్రెస్‌పై గుర్రుగా ఉన్న బీసీ వర్గాన్ని తమవైపు తిప్పుకొనే ప్రయత్నాల్లో ముమ్మరంగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే బీసీ నాయకుడు పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్‌కు రాజీనామా చేయగానే బీఆర్ ఎస్ ఆయనకు వల వేసింది.
మరింత మంది కాంగ్రెస్ అసంతృప్తులను, ముఖ్యంగా బీసీ నేతలను తమవైపు తిప్పుకొనే ప్రయత్నాలను బీఆర్ ఎస్ ముమ్మరం చేసింది. ఈ పరిణామాలను నిశితంగా గమనించిన కాంగ్రెస్ కూడా ఇప్పుడు మెజారిటీ స్థానాలను అంటే.. 119 స్థానాల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వ్‌డ్ స్థానాలను మినహాయించి.. మిగిలినవాటిలో 30 స్థానాలను బీసీలకే కేటాయించాలని నిర్ణయించడం గమనార్హం. ఈ క్రమంలో తాజాగా విడుదల చేసిన జాబితాలో ఎక్కువ మంది బీసీ నేతలు ఉండడం విశేషం. మరి ఈ ఫార్ములా రెడ్డి వర్గానికి కోపం తెప్పేస్తే పరిస్థితి ఏంటనేదిచూడాలి.