వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీకి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టగానే… పలువురు జర్నలిస్టులు, ప్రత్యేకించి జగన్ కుటుంబ సారథ్యంలోని ‘సాక్షి’ మీడియాలో పనిచేసిన చాలా మందికి ఏపీ ప్రభుత్వంలో సలహాదారుల బాధ్యతలు దక్కాయి. వీరిలో సీనియర్ జర్నలిస్టులు రామచంద్రమూర్తి, దేవులపల్లి అమర్ లతో పాటు పలువురు జర్నలిస్టులు ఉన్నారు.
వీరిలో ఎవరు ఏ పని చేస్తున్నారు? వారికి జగన్ సర్కారు అప్పగించిన బాధ్యతలు ఏమిటి? అన్న విషయాలు ఇప్పటికీ తెలియరాలేదు. అయితే ఉరుము లేని పిడుగులా జగన్ సర్కారులో పబ్లిక్ పాలసీ అడ్వైజర్ గా కొనసాగుతున్న రామచంద్రమూర్తి తనకు తానుగా సదరు పదవికి రాజీనామా చేసేశారు. ఈ అనూహ్య పరిణామం వెనుక కారణాలు ఏమైనా గానీ… సలహాదారుల పనితీరుపై జగన్ సమీక్ష చేయబోతున్నారన్న వార్తలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
ఏపీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన జగన్ సదరు పదవిలో అప్పుడే ఏడాది పూర్తి చేసుకున్నారు. నిత్యం ఆయా ప్రభుత్వ కార్యకలాపాల్లో బిజీగా ఉంటున్న జగన్… ఇప్పుడు కాస్తంత తీరిక చూసుకుని.. తాను నియమించుకున్న అడ్వైజర్లలో ఎవరెవరు ఏ మేరకు పని చేస్తున్నారన్న విషయంపై సమీక్ష చేసేందుకు రంగం సిద్ధం చేశారట.
ఈ విషయం తెలుసో? లేదో? గానీ… జగన్ సమీక్షలకు ముందే రామచంద్రమూర్తి అడ్వైజర్ పదవికి రాజీనామా చేయడం కలకలం రేపింది. పరిస్థితి చూస్తుంటే.. జగన్ సమీక్ష చేస్తే.. అసలు తాను ఇప్పటిదాకా ఏం చేశానన్న విషయంపై ఏ వివరణ ఇవ్వాలన్న భావనతోనే మూర్తి రాజీనామా చేసినట్లుగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే… రామచంద్రమూర్తి సహా జగన్ నియమించుకున్న సలహాదారులందరికీ ఏ పని చేయాలన్న విషయంపై ఇప్పటిదాకా ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు లేవనే చెప్పాలి. ఈ ఆదేశాల మాట అటుంచితే… అసలు వీరికి కనీసం కార్యాలయాలు గానీ, ఏదేనీ కార్యాలయాల్లో కూర్చునేందుకు సీట్లు గానీ కేటాయించలేదన్న మాట కూడా గట్టిగానే వినిపిస్తోంది.
ఇలాంటి నేపథ్యంలో అడ్వైజర్ల పనితీరుపై జగన్ సమీక్ష జరిపితే… ఏ ఒక్కరికి కూడా పాస్ మార్కులు వచ్చే అవకాశాలు లేవన్న వాదనలు వినిపిస్తున్నాయి. అంటే… సమీక్షలకు ముందే మూర్తి గారు స్వయంగా తప్పుకుంటే… సమీక్ష తర్వాత మరింత మంది సలహాదారులు కూడా తమ పదవుల నుంచి తప్పుకోక తప్పదన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.