చంద్రబాబు సెల్ లో ఏసీ పెట్టాలని కోర్టు ఆదేశం

రాజమండ్రి సెంట్రల్ జైల్లో టీడీపీ అధినేత చంద్రబాబు అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. డీహైడ్రేషన్ తో పాటు స్కిన్ ఎలర్జీతో చంద్రబాబు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు ప్రభుత్వ వైద్యులు జైల్లోనే చికిత్స అందిస్తున్నారు. అయితే, చంద్రబాబుకు మరింత మెరుగైన వైద్యం అందించాలని కోరుతూ ఆయన తరఫు లాయర్లు విజయవాడ ఏసీబీ కోర్టులో హౌస్‌మోషన్ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే ఆ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు చంద్రబాబుకు ఊరటనిచ్చింది.

చంద్రబాబు సెల్ లో ఏసీ సౌకర్యం కల్పించాలని ఏసీపీ కోర్టు న్యాయమూర్తి సంచలన ఆదేశాలు జారీ చేశారు. చంద్రబాబు అనారోగ్య రీత్యా ఏసీ ఏర్పాటు చేయాలని జైలు అధికారులను ఆదేశించారు. ఆన్‌లైన్ ద్వారా ఈ పిటిషన్ విచారణ చేసిన కోర్టు అత్యవసరంగా ఏసీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. చంద్రబాబుకు వైద్యులు ఇచ్చిన నివేదికను న్యాయమూర్తికి చంద్రబాబు తరఫు లాయర్లు వివరించారు. చంద్రబాబుకు చల్లని వాతావరణ పరిస్థితులు కల్పించాలని పిటిషన్ లో పేర్కొన్నారు. అవసరమైతే మెరుగైన వైద్యం కోసం కార్పొరేట్ ఆసుపత్రికి తరలించాలని కోరారు.

అంతకుముందు, చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్‌ మీడియాతో మాట్లాడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చంద్రబాబు అనారోగ్యంపై డీఐజీ రవి కిరణ్‌ ను లోకేష్ ప్రశ్నించారు. చంద్రబాబుకు ఆరోగ్య సమస్యలున్నాయని వైద్యులు చెబుతున్నారని, కానీ, ప్రజలను తప్పుదోవ పట్టించేలా డీఐజీ ప్రకటనలు ఇవ్వడం ఏమిటని లోకేష్ మండిపడ్డారు. వైద్యులు చెప్పిన 48 గంటల తర్వాత కూడా వారి సూచనలు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. ఒక మాజీ ముఖ్యమంత్రి డీ హైడ్రేషన్ బారిన పడ్డారని, చల్లని వాతావరణం కల్పించాలని వైద్యులు సూచించినా ఎందుకు ఇంత నిర్లక్ష్యం అని మండిపడ్డారు. అయితే, తన ప్రశ్నలకు డీఐజీ సమాధానమివ్వకుండా దురుసుగా వ్యవహరించారని లోకేష్ ఆరోపించారు.