ప్రవళిక సూసైడ్ ఇష్యూలో కొత్త ట్విస్ట్

తెలంగాణలో గ్రూప్-2 అభ్యర్థి ప్రవళిక ఆత్మహత్య వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని, గ్రూప్-2 నోటిఫికేషన్ వాయిదా పడడంతోనే ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇది ఆత్మహత్య కాదని, ప్రభుత్వం చేసిన హత్య అని ప్రభుత్వంపై విపక్ష నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రవళిక ఆత్మహత్య గురించి పోలీసులు సంచలన ప్రకటన చేశారు. ప్రవళిక ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు మీడియాకు వెల్లడించారు.

ఆ యువతి సూసైడ్ చేసుకోవడానికి ప్రవళిక ప్రేమ వ్యవహారమే కారణమని ప్రాథమిక దర్యాఫ్తులో తేలినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రవళిక చనిపోయిన సమాచారం శుక్రవారం సాయంత్రం అందిందని, ఆమె గదిలో సూసైడ్ నోట్ దొరికిందని చెప్పారు. ఇప్పటిదాకా ప్రవళిక ఏ పోటీ పరీక్షలకు హాజరు కాలేదని, ఆత్మహత్యలపై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయని అన్నారు. శివరామ్ రాథోడ్ అనే యువకుడితో ఆమె చాటింగ్‌ను గుర్తించామని, శివరామ్ మరో యువతిని పెళ్లి చేసుకోవడంతో తాను మోసపోయానని ప్రవళిక ఆవేదన చెందిందని ఆ చాటింగ్ ద్వారా గుర్తించామన్నారు. ప్రవళిక, శివరామ్ కలిసి ఓ హోటల్‌కు వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజీ దొరికిందని చెప్పారు.

శివరామ్‌పై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని, ప్రవళిక సెల్ ఫోన్, సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకొని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించామని వెల్లడించారు. వ్యక్తిగత కారణాలతో ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని తోటి విద్యార్థులు చెప్పినా పట్టించుకోకుండా విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు నిరసన వ్యక్తం చేస్తున్నాయని పోలీసులు అన్నారు. తాజాగా పోలీసుల ప్రకటనతో ప్రవళిక సూసైడ్ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది.