ఆంధ్రప్రదేశ్‌లో ఇంకో ఐదు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక అన్ని పార్టీల్లోనూ టికెట్ల గొడవ షురూ కాబోతోంది. తెలుగుదేశం, జనసేన మధ్య పొత్తు ఖరారు కావడంతో పరస్పరం ఇచ్చి పుచ్చుకునే సీట్లను బట్టి ఇరు పార్టీల్లో అసంతృప్తి గళాలు వినిపించడం ఖాయం. జనసేనలో కొంచెం ముందుగానే ఒక అసంతృప్తి స్వరం బయటికి వచ్చింది. ఆ స్వరమే.. కేతంరెడ్డి వినోద్‌రెడ్డిది. నెల్లూరు జనాలకు ఈ పేరు బాగా పరిచయం. సామాజిక మాధ్యమాల్లో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న యువ నేత ఇతను. జనసేన పార్టీ మొదలైన కొంత కాలం నుంచే ఆ పార్టీలో ఉంటూ చాలా చురుగ్గా కార్యక్రమాలు చేస్తున్నాడు. గత ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేశాడు కూడా. కానీ ఓటమి తప్పలేదు. ఐతే కుంగిపోకుండా ఆ తర్వాత మరింత చురుగ్గా పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటున్నాడు. ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్‌ను మించి అతను జనాల్లో తిరిగాడు.
పవన్‌ను సీఎంను చేయాలంటూ ఒక ప్రత్యేక కార్యక్రమం పెట్టుకుని నెల్లూరులో విస్తృతంగా పని చేయడమే కాక.. పార్టీ గళాన్ని గట్టిగా వినిపించాడు. అలాగే వైసీపీ మీద యుద్దం చేశాడు. నెల్లూరు మాజీ ఎమ్మెల్యే అయిన టీడీపీ నేత నారాయణకు వ్యతిరేకంగా కూడా కార్యక్రమాలు చేశాడు కేతంరెడ్డి. ఐతే కొన్ని నెలల కిందట నెల్లూరు సిటీ టీడీపీ అభ్యర్థిగా నారాయణనే ప్రకటించారు. ఆ తర్వాత జనసేన, టీడీపీ మధ్య పొత్తు ఖరారైపోయింది. దీంతో వినోద్ రెడ్డికి టికెట్ రాదని తేలిపోయింది. పొత్తు ఖరారవడం ఆలస్యం.. కేతంరెడ్డి అసంతృప్తి స్వరం మొదలుపెట్టాడు. పార్టీ కార్యక్రమాలకు దూరం అయ్యాడు. నెల రోజులుగా సోషల్ మీడియాలో ఏవో కోట్స్ పెడుతూ పరోక్షంగా పవన్ మీద విమర్శలు గుప్పిస్తూ వచ్చాడు. తాను పార్టీని వీడబోతున్న సంకేతాలు ఇచ్చాడు. రెండు రోజుల కిందట అదే పని చేశాడు. వెంటనే అతను వైసీపీలో చేరిపోయాడు.
ఐతే రాజకీయ నాయకులు ఇలా పార్టీలు మారడం కొత్తేమీ కాదు కానీ.. వినోద్‌రెడ్డిని మాత్రం జనం భిన్నంగా చూస్తున్నారు. అతను సంప్రదాయ రాజకీయ నాయకుల్లా కనిపించడు. జనసేన కోసం అంత కాలం పని చేసి.. వైసీపీ మీద తీవ్రంగా విమర్శలు గుప్పించి.. నిజాయితీ పరుడిగా, పోరాట యోధుడిగా పేరు తెచ్చుకున్న వినోద్ రెడ్డి.. ఇప్పుడు వైసీపీలోకి వెళ్లడం చాలామందికి జీర్ణం కావడం లేదు. వినోద్ రెడ్డి లాంటి వ్యక్తి వైసీపీలో ఇమడలేడని, అతడికి ఆ పార్టీ ప్రాధాన్యం కూడా ఇవ్వదని.. అసలు అనిల్‌ను కాదని, వినోద్‌కు అక్కడ టికెట్ దక్కే అవకాశం కూడా లేదని అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ అదే జరిగితే వినోద్ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారవుతుందని.. జనసేనలోనే ఉండి ఒకవేళ టీడీపీ-జనసేన అధికారంలోకి వస్తే నామినేటెడ్ పోస్టు అయినా దక్కేదని, అతను పడ్డ కష్టం, చేసిన త్యాగం గుర్తుంచుకుని పార్టీలో ప్రాధాన్యం దక్కేదని.. కానీ వైసీపీలోకి వెళ్లి అతను తప్పు చేశాడనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి.