‘ఆ పార్టీల‌కు ఓటేస్తే.. తెలంగాణను ఏపీలో క‌లిపేస్తారు’

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల సంరంభం ప్రారంభ‌మైంది. కేంద్ర ఎన్నిక‌ల సంఘం నోటిఫికేష‌న్ ఇచ్చి వారం రోజులు కూడా కాలేదు. ఇంత‌లోనే సెంటిమెంటు రాజ‌కీయాలు ప్రారంభ‌మైపోయాయి. తాజాగా బీఆర్ ఎస్ నాయ‌కుడు, మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్నిఏపీలో క‌లిపేసేందుకు కుట్ర‌లు జ‌రుగుతున్నాయ‌ని ఆయ‌న అన్నారు.

బీజేపీ, కాంగ్రెస్‌లు ఒక్క‌టేన‌ని, ఈ రెండు పార్టీలకు ఓటేస్తే.. తెలంగాణ‌ను ఏపీలో క‌లిపేయ‌డం ఖాయ‌మ‌ని మంత్రి గంగుల వ్యాఖ్యానించారు. “ఆంధ్రోళ్లు.. కాంగ్రెస్‌, బీజేపీ ముసుగులో వ‌స్తున్నారు. ఎన్నిక‌ల్లో వారిని ఆద‌రిస్తే.. ఓటేస్తే.. మ‌న ప‌ని ఖ‌తం. ఎన్నిక‌ల్లో కేసీఆర్ ఓడిపోతే ఢిల్లీ పెద్ద‌ల‌తో ఆ పార్టీ నేత‌లు మాట్లాడి తెలంగాణ‌ను ఏపీలో క‌లిపేసే కుట్ర చేస్తున్నారు. ఇది మ‌న భ‌విష్య‌త్ త‌రానికి ఇబ్బందిక‌రం” అని మంత్రి అన్నారు.

వాస్త‌వానికి తెలంగాణలో జ‌రిగిన 2018 ఎన్నిక‌ల్లోనూ తెలంగాణ సెంటిమెంటును బీఆర్ ఎస్ నాయ‌కులు ప్లే చేశారు. అప్ప‌ట్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న టీడీపీని, ఆ పార్టీ అధినేత చంద్ర‌బాబును బూచిగా చూపించారు. “మ‌న‌మీద మ‌ళ్లీ ఆంధ్రోళ్లు పెత్త‌నం చేసేందుకు వ‌స్తున్న‌రు. ఆంధ్రోళ్ల పెత్త‌నం మ‌న‌కు అవ‌స‌ర‌మా?” అంటూ స్వ‌యం సీఎం కేసీఆర్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో వ్యాఖ్యానించి సెంటిమెంటును రాజేశారు. ఇక‌, ఇప్పుడు మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ రూపంలో సెంటిమెంటు రాజ‌కీయాల‌కు శ్రీకారం చుట్టిన‌ట్ట‌యింది. రానున్న రోజుల్లో ఈ రాజ‌కీయం ఎలాంటి మ‌లుపు తిరుగుతుందో చూడాలి.