జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై సీఎం జగన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పవన్‌కు ఏపీలో ఇల్లు లేదని, భార్యలను మారుస్తుంటారని జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలలో దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పవన్ పై జగన్ వ్యాఖ్యలకు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు కౌంటర్ ఇచ్చారు. పవన్ పెళ్లిళ్లపై జగన్ నోటికి వచ్చినట్టు మాట్లాడారని ఆ వ్యాఖ్యలను రఘురామ తీవ్రంగా ఖండించారు. పవన్ మొన్ననే ఏపీలో ఇల్లు కట్టుకున్నారని రఘురామ అన్నారు. జగన్ లాగా పవన్ దగ్గర డబ్బులు లేవని, నటించి సంపాదిస్తున్నారని జగన్ కు చురకలంటించారు.
పవన్ తన కులాన్ని, కాపులను, తన వారని చెప్పుకోవడం లేదని జగన్ అంటున్నారని, మరి జగన్ ఒక్కసారైనా రెడ్డి అని చెప్పుకున్నారా? అంటూ రఘురామ ప్రశ్నించారు. జగన్ కమ్మ, ఓబీసీలను ద్వేషిస్తారని ఆరోపించారు. వైఎస్ విజయలక్ష్మి విశాఖలో ఎందుకు పోటీ చేశారని పవన్ అడిగితే జగన్ ఏం సమాధానం చెబుతారని రఘురామ నిలదీశారు. తెలంగాణలో విజయలక్ష్మి పాలేరు, షర్మిల మిర్యాలగూడలో పోటీ చేయొచ్చా అని ప్రశ్నిస్తే ఏం చెబుతారని అన్నారు. జగన్ దొడ్డి దారిన విశాఖ వెళ్తున్నారని, పెద్ద భవనాలు నిర్మించారని అన్నారు. 3 ప్రాంతాలు అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి విశాఖకు వెళ్తారా? అని ప్రశ్నించారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను లోకేష్ కలిశారని, ఆ సమయంలో పురందేశ్వరి, కిషన్ రెడ్డి ఉన్నారని చెప్పారు. దీంతో, వైసీపీ నేతలు కలవరపాటుకు గురయ్యారని ఎద్దేవా చేశారు. పురందేశ్వరి లోకేష్, షాల సమావేశం ఏర్పాటు చేశారంటూ వైసీపీ నేతలు చేస్తున్న కారుకూతలు ఆపాలని మండిపడ్డారు. చంద్రబాబుపై కేసు వెనుక కేంద్రం ఉన్నట్టు జగన్ ప్రచారం చేసుకున్నారని, ఆ కుట్రలో బీజేపీకి భాగం ఉన్నట్టు వైసీపీ నేతలు మాట్లాడారని చెప్పారు. తనపై కేసు తర్వాత అమిత్ షాను తన కుటుంబ సభ్యులు కలిశారని, అలాగే లోకేష్ కూడా కలిశారని అన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates