రంగంలోకి కేసీఆర్‌.. ఆ ఎమ్మెల్యేల విష‌యంలో సంచ‌ల‌న నిర్ణ‌యం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఎట్టి ప‌రిస్థితిలోనూ విజ‌యం ద‌క్కించుకుని తీరాల‌ని హ్యాట్రిక్ కొట్టాల‌ని గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉన్న అధికార పార్టీ బీఆర్ ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌.. త‌న‌దైన శైలిలో నియోజ‌క‌వ‌ర్గాల‌పై ప్ర‌త్యేక దృష్టి పెట్టారు. ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ రాక‌మునుపే.. ఆయ‌న అభ్య‌ర్థులను ఖ‌రారు చేయ‌డంతోపాటు అసంతృప్త నేత‌ల‌ను కూడా బుజ్జ‌గించారు. ఇక‌, ప‌లు జిల్లాల్లో సిట్టింగుల‌కే సీట్లు కేటాయించారు. ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ‌, ఆదిలాబాద్‌, రంగారెడ్డి, నిజామాబాద్‌ వంటి కీల‌క‌మైన జిల్లాల్లో సిట్టింగుల‌కు ప్రాధాన్యం ఇచ్చారు.

కుల‌, వ‌ర్గ ప్రాధాన్యాల‌ను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న ఈ నిర్ణ‌యం ఇప్పుడు సీఎం కేసీఆర్‌కు ఇబ్బంది గా మారింద‌నే చ‌ర్చ సాగుతోంది. ఇప్పటికే ఆయా జిల్లాల్లోని సిట్టింగు ఎమ్మెల్యేల ప‌నితీరు, వారికి ప్ర‌జ‌ల్లో ఉన్న ఆద‌ర‌ణ‌, ఓటు రేటింగ్ వంటి కీల‌క అంశాల‌పై రెండు మూడు ద‌ఫాలుగా స‌ర్వేలు చేయించి.. స‌మా చారం సేక‌రించారు. అనంత‌ర‌మే వారికి టికెట్లు కేటాయించారు. అయితే.. ఇప్పుడు మ‌రోసారి చేయించిన అంత‌ర్గ‌త స‌ర్వేల్లో కొంద‌రు సిట్టింగులు వెనుక‌బ‌డుతున్నార‌ని స‌మాచారం.

ప్ర‌ధానంగా గ‌త ఐదేళ్ల‌లో వారు స్థానికంగా ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన కొన్ని హామీల‌ను నెర‌వేర్చ‌క‌పోవ‌డంపై ప్ర‌జ‌లు ఆగ్ర‌హంతో ఉన్నార‌ని.. సీఎంకే స‌ర్వేల ద్వారా స‌మాచారం చేరింది. దీంతో ఇప్పుడు ఆయా నియోజ‌క‌వ‌ర్గా ల్లో మార్పులు చేయ‌లేక‌.. వారిని గెలిపించే వ్యూహాల‌పై సీఎం దృష్టి పెట్టిన‌ట్టు ప్ర‌గ‌తి భ‌వ‌న్ వ‌ర్గాలు చెబు తున్నాయి. ఈ క్ర‌మంలో ప్ర‌స్తుతం ఇబ్బందుల్లో ఉన్న ఎమ్మెల్యే జాబితాను త‌న చేతిలో పెట్టుకున్న సీఎం కేసీఆర్‌.. ఎన్నిక‌ల‌కు ముందు ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో సుడిగాలి ప‌ర్య‌ట‌న‌లు చేసి ప్ర‌చారం చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలిసింది.

అదేస‌మ‌యంలో ఎమ్మెల్యేలు స్థానికంగా ఇచ్చిన హామీలు, వాటిలో నెర‌వేర్చ‌ని వాటిని కూడా వారి నుంచే స‌మాచారం సేక‌రించి.. ఆయా హామీల‌పై స్థానికుల్లో నెల‌కొన్న అసంతృప్తిని తొలగించే ప్ర‌య‌త్నం కేసీఆర్ చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. మొత్తంగా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకునేందుకు.. ఇప్ప‌టికే మంత్రులు కేటీఆర్‌, హ‌రీష్‌రావుల‌పై పూర్తిస్థాయి భారం మోపిన‌ప్పటికీ.. మ‌రికొంత మాత్రం తానే భ‌రించి.. హ్యాట్రిక్ మిస్ కాకూడ‌ద‌నే నిర్ణ‌యంలో సీఎం ఉన్న‌ట్టు ప్ర‌గ‌తి భ‌వ‌న్ వ‌ర్గాలు చెబుతున్నాయి.