బ్రేకింగ్: చంద్రబాబుకు ముందస్తు బెయిల్

స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గత నెల రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ పై ఉన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత అమరావతి ఇన్నర్ రింగురోడ్డు అలైన్మెంట్ మార్పు, ఏపీ ఫైబర్ నెట్ కేసు, అంగళ్లు అల్లర్ల కేసులలో కూడా చంద్రబాబు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ఆ కేసులలో బెయిల్, ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు తరఫు లాయర్లు ఏసీబీ కోర్టు, హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అయితే, ఇప్పటివరకు ఒక్క కేసులో కూడా చంద్రబాబుకు ఊరట లభించలేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇన్నర్ రింగురోడ్డు కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు కాస్త ఊరటనిచ్చింది. ఆ కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిలు మంజూరు చేసింది.

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, అంగళ్లు కేసుల్లో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లను ఈరోజు హైకోర్టు విచారణ జరిపింది. చంద్రబాబు తరపున దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. చంద్రబాబును అరెస్ట్ చేయకుండా ఉత్వర్వులు ఇవ్వాలని, కేసుల విచారణకు సహకరిస్తామని న్యాయమూర్తికి వెల్లడించారు. ఈ క్రమంలో ఇన్నర్ రింగు రోడ్డు కేసులో చంద్రబాబుకు సోమవారం వరకు హైకోర్టు ముందస్తు బెయిలు మంజూరు చేసింది. వచ్చే సోమవారం వరకు చంద్రబాబును అరెస్ట్ చేయవద్దని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు, అంగళ్లు కేసులో రేపటివరకు చంద్రబాబును అరెస్టు చేయవద్దని తెలిపింది. దీంతో, చంద్రబాబుకు కాస్త ఊరట దక్కినట్లయింది.