తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముంగిట అసలు సిసలు రాజకీయానికి అధికార పార్టీ బీఆర్ ఎస్ తెరతీసింది. ముచ్చటగా మూడోసారి అధికారం దఖలు పరుచుకోవడం ద్వారా.. తెలంగాణలో అధికారం తమకు తప్ప.. అన్న వాదాన్ని బలంగా ముందుకు తీసుకువెళ్లాలని భావిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే తనపై ఎన్నికల ప్రజర్ లేకుండా చేసుకున్న పార్టీ అధినేత, సీఎం కేసీఆర్.. ఎన్నికల ప్రకటన దరిమిలా.. ఇతర పార్టీలను టెన్షన్‌లోకి నెట్టే రాజకీయాలకు చాపలెత్తారు.
రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకటి రెండు తప్ప దాదాపు అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థు లను ఖరారు చేశారు సీఎం కేసీఆర్. దీంతో పార్టీలో కీచులాటలకు, ఎగస్పార్టీ రాజకీయాలకు దాదాపు చెక్ పెట్టారనే చెప్పాలి. ఒకవేళ ఇలాంటి పరిణామాలు ఉన్నప్పటికీ.. మంత్రి కేటీఆర్ చక్రం తిప్పి.. పరిస్థితు లను తమకు అనుకూలంగా మార్చుతున్నారు. ఇదిలావుంటే, ఇప్పుడు అసలు సమస్య, ఇటు కాంగ్రెస్‌కు, అటు బీజేపీ పట్టుకుంది.
ముఖ్యంగా అంతో ఇంతో సానుభూతి పవనాలు సొంతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ అధికారంపై ఎడతెగని ఆశలు పెట్టుకుంది. తెలంగాణ ఇచ్చింది తామేనని చెప్పుకొనే కాంగ్రెస్ ఇప్పటికి రెండు సార్లు అధికారానికి దూరమైంది. ఈ నేపథ్యంలో ఈ దఫా అధికారం దక్కడం ఖాయమని ఒకింత గట్టిగానే ఆశలు పెట్టుకుంది. అయితే..ఇప్పుడు నేతల దూకుడు, వీరికి బీఆర్ వేస్తున్న ఆకర్ష్ మంత్రం వంటివి కాంగ్రెస్‌కు చుక్కలు చూపించడం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు.
కాంగ్రెస్ పార్టీలో ఒక సీటుకు ఇద్దరి నుంచి ముగ్గురు నాయకులు పోటీ పడుతున్న నియోజకవర్గాలు దాదా పు 50 నుంచి 60 ఉన్నట్టు లెక్కలు స్పష్టంగా చెబుతున్నాయి. అయితే.. ఒక్కరికి మాత్రమే టికెట్ ప్రకటించే వీలుండడంతో టికెట్ ఆశించి భంగ పడిన వారు పార్టీకి ఎగస్పార్టీగా మారే ప్రమాదం ఉంది. ఇలాంటి వారిని తమవైపు తిప్పుకొనేందుకు, కండువా కప్పి.. నామినేషన్ పదవుల ఆశ చూపేందుకు బీఆర్ ఎస్ అస్త్ర శస్త్రాలు సిద్ధం చేసుకుంది.
ఇదే సూత్రాన్ని బీజేపీ నేతల విషయంలోనూ బీఆర్ ఎస్ అమలు చేస్తోందని సమాచారం. ప్రధానంగా కాంగ్రెస్‌లో టికెట్ల ప్రకటన ఒక యుద్ధంగా మారనుండగా.. ప్రకటన తర్వాత.. ఆకర్ష్ దెబ్బతో చోటు చేసుకునే పరిణామాలు కూడా ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. మరి బీఆర్ ఎస్ ఆకర్ష్ మంత్రాన్ని కాంగ్రెస్ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates