రాజమండ్రి జైలులో టీడీపీ అధినేత చంద్రబాబు భద్రతపై నారా లోకేష్ తో పాటు నారా భువనేశ్వరి, బ్రాహ్మణి, టీడీపీ నేతలు చాలాకాలంగా ఆందోళన చెందుతోన్న సంగతి తెలిసిందే. చంద్రబాబును హౌస్ రిమాండ్ కు ఇవ్వాలని కోరినా…కోర్టు అనుమతించలేదు. ఈ క్రమంలోనే తాజాగా చంద్రబాబుతో ములాఖత్ అయిన లోకేష్…చంద్రబాబు భద్రతపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రి జైలుపై, చంద్రబాబుపై దాడి చేస్తామని ఎస్పీకి కొందరు నక్సలైట్లు లేఖ రాశారని లోకేష్ చెప్పారు.
ఆల్రెడీ జైల్లో కొందరు నక్సల్స్, గంజాయి కేసుల్లో ఖైదీలుగా ఉన్నవారు ఉన్నారని లోకేష్ అన్నారు. 45 ఏళ్లపాటు చంద్రబాబు ప్రజల కోసం చాలామందిపై పోరాడారని, అటువంటి వ్యక్తులతో పాటు చంద్రబాబు జైల్లో ఉండడంతో ఆయన భద్రతపై ఆందోళన చెందుతున్నామని చెప్పారు. ప్రభుత్వంపై పోరాటం ఆగదని, టీడీపీ – జనసేన కలిసి సంయుక్త కార్యాచరణ కమిటీ ఏర్పాటు చేసి ముందుకు పోతామని అన్నారు. చంద్రబాబు ఏనాడూ తప్పు చేయలేదని, జైల్లో ఉన్నా ప్రజల గురించే ఆయన ఆందోళన చెందుతున్నారని చెప్పారు. చంద్రబాబు ఆరోగ్యం బాగానే ఉందని, పిచ్చి జగన్ కన్నా ముందే తిరుమల కొండ ఎక్కారని అన్నారు.
ఆయన అధైర్యపడలేదని, పోరాటం ఆపవద్దని, శాంతియుతంగా పోరాడాలని తమతో చెప్పారని అన్నారు. న్యాయం ఆలస్యం అయినా తమ వైపే ఉంటుందని, అందులో సందేహం లేదని చెప్పారు. తమ కుటుంబాన్ని వైసీపీ ప్రభుత్వం రోడ్డుపైకి తెచ్చిందని, తాము నమ్ముకున్న సిద్ధాంతాల కోసం పోరాడతామని చెప్పారు. ఢిల్లీలో రాష్ట్రపతిని, ఇతర పార్టీల నేతలను కలిసి ఏపీలో పరిస్థితి వివరించామని చెప్పారు. చంద్రబాబు తప్పు చేసే వ్యక్తి కాదని, కడిగిన ముత్యంలా ఆయన బయటకు వస్తారని వారంతా తనకు భరోసానిచ్చారని లోకేష్ అన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates