స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఏపీ సీఐడీ తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నిన్న విచారణ సందర్భంగా పొన్నవోలుపై విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి హిమ బిందు అసహనం వ్యక్తం చేశారని ప్రచారం జరిగింది. గతంలో చెప్పిందే ఎన్నిసార్లు చెబుతారని న్యాయమూర్తి అన్నారని కొన్ని మీడియా ఛానెళ్లలో వచ్చిందని, అందులో వాస్తవం లేదని పొన్నవోలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు బయట మీడియా ముందు కొన్ని చానెళ్లపై అసహనం వ్యక్తం చేసి ఆ ఆరోపణలపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఈ క్రమంలోనే పొన్నవోలుపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.
పొన్నవోలు చెప్పిందే చెబుతున్నారని జడ్జి అన్నట్లు అన్ని ఛానల్స్‌లో వచ్చిందని, ఆయన సినీ నటుడిగా మారితే బాగుటుందని రఘురామ ఎద్దేవా చేశారు. పవర్ ఫుల్ డైలాగ్ చెప్పేవారు లేరని, ఎంత తక్కువ రెమ్యునరేషన్ ఇచ్చినా తప్పులేదని చురకలంటించారు. ప్లీడర్ పొన్నవోలు అనే టైటిల్ పెట్టి సినిమా తీస్తే బాగుంటుందని సెటైర్లు వేశారు. పొన్నవోలు సుధాకర్ నిన్న కోర్టు బయట ఎందుకు ఫీల్ అయ్యారో అర్థం కావడం లేదని రఘురామ అన్నారు. తన కేసులో పొన్నవోలు తీరుపై కోర్టు తిట్టని తిట్టు లేదని గుర్తు చేశారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై కూడా రఘురామ ప్రశంసలు కురిపించారు. ఏపీలో వైసీపీ పాలన పోవాలని పవన్ అన్నారని, టీడీపీ అనుభవం, జనసేన ఉడుకు రక్తం తోడు కావాలని పవన్ చెప్పారని అన్నారు. నరసాపురం నియోజకవర్గంలో ఓటుకు రూ.5 వేలు చొప్పున జగన్ పంచే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. అక్టోబరు 9వ తేదీన సుప్రీం కోర్టులో చంద్రబాబుకు న్యాయం జరుగుతుందని జోస్యం చెప్పారు. లేని రింగ్‌రోడ్డులో ఇన్ని కేసులు పెడితే.. అసలు రాజధాని లేపేసిన వారిపై ఎన్ని కేసులు పెట్టాలి అని జగన్ ను ఉద్దేశించి పరోక్షంగా చురకలంటించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates