స్కిల్ డెవలప్‌మెంట్ అక్రమ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు రిమాండ్ ను ఈ నెల 19 వరకు విజయవాడలోని ఏసీబీ కోర్టు పొడిగించింది. చంద్రబాబుకు మరో రెండు వారాల రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ రోజుతో చంద్రబాబు రిమాండ్ ముగియనున్న నేపథ్యంలో తాజాగా ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు, చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్ల విచారణను రేపటికి కోర్టు వాయిదా వేసింది.
చంద్రబాబు రిమాండ్ ను మరో 15 రోజుల పాటు పొడిగించాలని విజయవాడ ఏసీబీ కోర్టు సీఐడీ అధికారులు మెమో దాఖలు చేశారు. చంద్రబాబుకు బెయిల్ ఇవ్వాలని ఆయన తరఫు లాయర్ దూబే…కస్టడీకి ఇవ్వాలని సీఐడీ తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాడీవేడి వాదనలు వినిపించారు. కేబినెట్ నిర్ణయం ప్రకారం స్కిల్ స్కీం ఒప్పందం అమలు కాలేదని, ఆ తప్పిదాలకు చంద్రబాబే బాధ్యుడని పొన్నవోలు వాదించారు. ఈ స్కాంలో రూ.27 కోట్లు టీడీపీ ఖాతాలో జమ అయ్యాయని,13 చోట్ల చంద్రబాబు సంతకాలు పెట్టారని వాదనలు వినిపించారు. రెండు రోజుల కస్టడీలో చంద్రబాబు విచారణ పూర్తి కాలేదని, బ్యాంక్ లావాదేవీలపై చంద్రబాబును విచారణ జరపాల్సి ఉందని చెప్పారు. ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ యాక్ట్ చంద్రబాబుకు వర్తిస్తుందని, కస్టడీకి తీసుకుని మరిన్ని విషయాలు రాబట్టాలని వాదించారు.
ఇక, ఈ స్కీంతో చంద్రబాబుకు సంబంధం లేదని, రాజకీయ కక్షతో కేసు పెట్టారని దూబే వాదించారు. కేసు నమోదైన రెండేళ్ల తర్వాత రాజకీయ కారణాలతో చంద్రబాబును ఇరికించారని ఆరోపించారు. సీఎం హోదాలో చంద్రబాబు నిధులు మాత్రమే మంజూరు చేశారని, ఒప్పందం ప్రకారం 40 స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లను ఏర్పాటు చేశారని చెప్పారు. ఇందులో చంద్రబాబు పాత్ర లేదని, ఈ కేసుతో చంద్రబాబుకు ఎలాంటి సంబంధం లేదుగనుక బెయిల్ ఇవ్వాలని కోరారు. మరోవైపు, ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై వాదనలు జరుగుతున్నాయి.