కేటీఆర్ కు పెద్ద పరీక్షేనా ?

రాబోయే తెలంగాణా ఎన్నికలు కేసీయార్ సంగతేమో కానీ మంత్రి కేటీయార్ కు మాత్రం పెద్ద పరీక్షగా మారేట్లుంది. ఎందుకంటే కేసీయార్ దాకా వెళ్ళాలంటే ఎవరికీ సాధ్యంకావటంలేదు. టికెట్లు దక్కనివాళ్ళు, ఆశావహులు, అసంతృప్తులు, అభ్యర్దులు ఇలా ప్రతి ఒక్కళ్ళకి సమస్యలున్నాయి. టికెట్లు ఆశించి భంగపడిన వాళ్ళతో పాటు టికెట్లు దక్కించుకున్న వాళ్ళు కూడా సమస్యలతోనే ఉన్నారు. భంగపడిన వాళ్ళకేమో టికెట్లు రాలేదని అసంతృప్తిగా ఉంటే టికెట్లు దక్కించుకున్న వాళ్ళేమో తమకు నియోజకవర్గాల్లో ఎవరు సహకరించటంలేదనే సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు.

రకరకాల సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారంతా కలవాలని అనుకుంటే కేసీయార్ ఎవరికీ అందుబాటులో ఉండటంలేదు. అలాంటి వాళ్ళకి కేటీయార్ ఒక్కళ్ళే దక్కుగా మారారు. ఎలాగంటే కేసీయార్ కొడుకు, మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనే మూడు హోదాలున్నాయి కాబట్టి అందరు కేటీయార్ ను కలవాలని అనుకుంటున్నారు. అయితే ఎవరికి కూడా కేటీయార్ ఎలాంటి సాయం చేసే పరిస్ధితిలో లేరని పార్టీవర్గాల సమాచారం.

ఎందుకంటే టికెట్లు ఇప్పిస్తానని కొంతమందికి కేటీయార్ చాలాకాలం క్రితమే హామీ ఇచ్చారట. అయితే హామీలిచ్చిన వాళ్ళల్లో చాలామందికి టికెట్లు దక్కలేదట. ఇదే విషయాన్ని కేటీయార్ అమెరికాలో ఉన్నపుడు మద్దతుదారులు ఫోన్లుచేసి మాట్లాడితే హైదరాబాద్ వచ్చినపుడు మాట్లాడుతానని చెప్పారట. తర్వాత హైదరాబాద్ వచ్చినా కొద్దిరోజులు కేటయార్ కూడా ఎవరికి అపాయిట్మెంట్లు ఇవ్వలేదు. దాంతో తండ్రి, కొడుకుల్లో ఎవరినీ కలవలేక చాలామంది తీవ్ర నిరాసకు గురయ్యారు.

ఇపుడు కూడా ప్రకటించేసిన టికెట్లను మార్పించాలంటే కేటీయార్ వల్లకాదు. వర్కింగ్ ప్రెసిడెంట్, కాబోయే సీఎం అనే ప్రచారంలో ఉన్న కేటీయార్ కూడా తనను మద్దతుదారులకు టికెట్లు ఇప్పించుకోలేకపోవటమే ఆశ్చర్యంగా ఉంది. హామీలిచ్చిన వాళ్ళకు కూడా టికెట్లు ఇప్పించుకోలేకపోతే భవిష్యత్తులో కేటీయార్ ను ఎవరు నమ్ముకుంటారు ? మద్దతుదారులుగా ఎందుకుంటారు ? టికెట్లు సంగతిని పక్కనపెట్టేస్తే అసంతృప్తులు కూడా కేటీయార్ మాటవినటంలేదు. స్టేషన్ ఘన్ పూర్, జనగాం, నర్సాపూర్, ఉప్పల్, ఖానాపూర్, వైరా, పటాన్ చెరువు, కల్వకుర్తి లాంటి నియోజకవర్గాల్లో మద్దతుదారులు కూడా కేటీయార్ మాట వినటంలేదని పార్టీవర్గాల టాక్. ముందే చెప్పుకున్నట్లు రాబోయే ఎన్నికలు కేటీయార్ కు కూడా పెద్ద పరీక్షగా మారేట్లుంది.