తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు, హైడ్రామా మధ్య పెడనలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్రలో భాగంగా బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా తనకు పోలీసులు నోటీసులు ఇచ్చిన వ్యవహారంపై పవన్ తీవ్రంగా స్పందించారు. తాను జనసేన కార్యకర్తలను, టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టలేదని, తాను కేవలం ఆవేశంగా మాట్లాడానని చెప్పారు. తాను ఎప్పటికీ అలా చేసేవాడిని కాదని, కొట్టండి, తగలబెట్టండి అని చెప్పనని పవన్ అన్నారు. ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వంపై పవన్ విరుచుకుపడ్డారు.
జగన్‌ది రూపాయి పావలా ప్రభుత్వం అని, రాబోయేది టీడీపీ-జనసేన ప్రభుత్వమేనని పవన్ ధీమా వ్యక్తం చేశారు. ఓట్ల కోసమే పథకాలను వైసీపీ ప్రకటిస్తోందని, అమలు మాత్రం డొల్లతనమేనని అన్నారు. నిధుల మళ్లింపులో ఏపీదే అగ్రస్థానమని, ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.337 కోట్లలో రూ.6.22 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని ఆరోపించారు.
టీడీపీ అనుభవాన్ని జనసైనికులు తక్కువ అంచనా వేయొద్దని, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో అందరం ఒకటి కావాలని పిలుపునిచ్చారు. ఏపీలో ప్రత్యేక పరిస్థితులున్నాయని, సభ పెట్టాలంటే ప్రత్యేక అనుమతులు, రాష్ట్రంలో అడుగు పెట్టాలంటే వీసా తీసుకోవాల్సిన పరిస్థితి ఉందని ఆరోపించారు. 2014లో రాష్ట్రం కోసం టీడీపీ, బీజేపీ కూటమికి తాను మద్దతిచ్చానని, వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా 2024 ఎన్నికలకు ముందు టీడీపీతో మరోసారి కలిసి వస్తున్నానని చెప్పారు.
అక్రమ తవ్వకాలను అడ్డుకుంటే జగన్ అనే దుష్ట వ్యక్తి, అన్యాయంగా కేసులు పెట్టించారని ఆరోపించారు. మర్దర్లు చేసిన వారిని గద్దెనెక్కించిన మీకు లేని భయం, దేశంకోసం ప్రాణ త్యాగాలు చేయడానికి సిద్దంగా ఉన్న తనకు ఎందుకు ఉంటుందని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే జోగి రమేశ్ అన్నింటా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.
జగన్ చెప్పిన 28 లక్షల ఇళ్లు ఎక్కడ ఉన్నాయో, ఏమయ్యాయో తెలియదని ఎద్దేవా చేశారు. జగనన్న ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కాదని, రాష్ట్రానికి వచ్చిన విపత్తు అని దుయ్యబట్టారు. ఏపీ ప్రజలు ఎవరి దగ్గర దేహీ అని అడుక్కునే పరిస్థితి రావొద్దని, అందుకే తనను తిట్టిన వారితోనూ చేయి కలిపేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates