ఏఏజీ పొన్నవోలుపై జడ్జి అసహనం

స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విజయవాడలోని ఏసీబీ కోర్టులో ఈ రోజు వాదనలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇరు వర్గాల న్యాయవాదుల వాదనలు విన్న ఏసీబీ కోర్టు ఆ పిటిషన్లపై విచారణను రేపటికి వాయిదా వేసింది. రేపు ఉదయం 11 గంటలకు వాదనలు వింటామని చెప్పింది. మరోవైపు, ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను కూడా ఏపీ హైకోర్టు రేపు ఉదయం 10.30 గంటలకు వాయిదా వేసింది.

అంతకుముందు, ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై వాడీవేడి వాదనలు జరిగాయి. ఆనాటి ఆర్థిక శాఖ ఉన్నతాధికారి కే.సునీత గుజరాత్ వెళ్లి స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టుపై అధ్యయనం చేశారని, ఆ తర్వాత సీమెన్స్ ప్రాజెక్టు ఎటువంటి అభ్యంతరం లేకుండా కేబినెట్ ఆమోదం పొందిందని చంద్రబాబు తరఫు న్యాయవాది వాదించారు. అది కేబినెట్ నిర్ణయం అని, చంద్రబాబు మీద కేసు ఎలా పెడతారని ప్రశ్నించారు. కాస్ట్ ఎవాల్యూయేషన్ కమిటీ స్కిల్ ప్రాజెక్టు ఎక్విప్‌మెంట్ ధరను నిర్ధారించిందని, ఆ కమిటీలో చంద్రబాబు లేరని వాదనలు వినిపించారు.

ఆ కమిటీలో ఉన్న భాస్కరరావు ఈ కేసులో మధ్యంతర బెయిల్ పై ఉన్నారని తెలిపారు. అయితే, ఈ కేసులో చంద్రబాబుకు నోటీసివ్వకుండా అరెస్ట్ చేసి తర్వాత విచారణ చేపట్టారని అన్నారు. రెండు రోజుల కస్టడీలోనూ సీఐడీ అధికారులు విచారణ జరిపి మళ్లీ కస్టడీ కావాలంటున్నారని, ఆ అవసరం ఏముందని ప్రశ్నించారు. మరోవైపు, ఏసీబీ కోర్టులో ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలపై న్యాయమూర్తి అభ్యంతరం వ్యక్తం చేశారు. చెప్పిన అంశాలను పదేపదే ఎందుకు చెబుతున్నారని ,నేరానికి సంబంధించిన ఆధారాలుంటే చూపాలని అసహనం వ్యక్తం చేశారు. రిమాండ్ రిపోర్ట్, కస్టడీ పిటిషన్‌ల సమయంలో చెప్పిన వాదనలే మళ్లీ చెబుతున్నారని అన్నారు. నిధుల దుర్వినియోగానికి సంబంధించిన ఆధారాలుంటే ఇవ్వండి, చెప్పిందే చెబుతుంటే ఎన్నిసార్లు వింటాం అసహనం వ్యక్తం చేశారు.