గంగూలీ గురించి క్రేజీ రూమర్

క్రికెటర్‌గా ఉన్నపుడు.. ఆటకు టాటా చెప్పేశాక.. ఎప్పుడూ సౌరభ్ గంగూలీ వార్తల్లో వ్యక్తే. బ్యాట్స్‌మన్‌గా, కెప్టెన్‌గా భారత క్రికెట్‌పై అతను వేసిన ముద్ర అలాంటిలాంటిది కాదు. భారత క్రికెట్ రాతనే మార్చేసిన ఆటగాడతను. ఆటకు వీడ్కోలు చెప్పాక కొంత కాలం వ్యాఖ్యాతగా కొనసాగిన దాదా.. ఆ తర్వాత క్రికెట్ పాలనలోకి వచ్చి అత్యున్నత శిఖరాలను అందుకున్నాడు.

ముందు బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడయ్యాడు. ఆపై అనూహ్యంగా బీసీసీఐ పీఠాన్ని కూడా అధిరోహించాడు. అన్నీ కలిసొస్తే ఐసీసీ అధ్యక్ష పీఠాన్ని కూడా గంగూలీ ఎక్కే అవకాశం లేకపోలేదు. కానీ గంగూలీ ఇప్పుడు అటు వైపు కాకుండా రాజకీయాల వైపు చూస్తున్నాడంటూ ఒక క్రేజీ రూమర్ హల్‌చల్ చేస్తోంది. అతను కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నాడంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది.

గంగూలీని దువ్వి తమ పార్టీలో చేర్చుకోవాలని కొన్నేళ్లుగా చాలామంది ప్రయత్నించారు. పశ్చిమబెంగాల్‌లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ కూడా గంగూలీకి వల విసిరింది. కానీ గంగూలీ రాజకీయాలపై పెదవి విప్పకుండా సైలెంటుగా ఉంటున్నాడు. కాగా గంగూలీ ఆరంభించాలనుకున్న ఓ పాఠశాల కోసం కోల్‌కతాలోని ఓ ఖరీదైన రెండెకరాల స్థలాన్ని మమత సర్కారు కొంత కాలం కిందట కేటాయించింది.

ఐతే దాని మీద వివాదం ఉండటంతో వ్యవహారం కోర్టుకు ఎక్కింది. తాజాగా గంగూలీ తనకా స్థలం వద్దంటూ ప్రభుత్వానికి వెనక్కి ఇచ్చేయడంతో ఆయన రాజకీయ అరంగేట్రం గురించి ప్రచారం ఊపందుకుంది. భారతీయ జనతా పార్టీ గంగూలీకి ఆహ్వానం పలికిందని.. పార్టీ పగ్గాలు అప్పగించి వచ్చే ఏడాది ఎన్నికల్లో మమతను ఢీకొట్టమని చెప్పిందని.. ఇందుకు గంగూలీ అంగీకరించాడని.. ఈ నేపథ్యంలోనే మమత సర్కారుకు స్థలాన్ని వెనక్కి ఇచ్చేశాడని ఓ ప్రచారం జరుగుతోంది. ఇదెంత వరకు నిజమన్నది గంగూలీనే నిర్ధరించాలి.