మోడీ మాటలు ఎవరైనా నమ్ముతారా ?

నిజామాబాద్ పర్యటనలో నరేంద్రమోడీ చాలా మాటలే చెప్పారు. ముఖ్యంగా కేసీయార్ ను కార్నర్ చేయటానికి కొన్ని విషయాలు ప్రస్తావించారు. అందులో తనకు కేసీయార్ కు మధ్య ఎప్పుడో జరిగిన సంభాషణలను ఇపుడు బయటపెట్టారు. ఈ సందర్భంగా కేసీయార్ గురించి మోడీ చెప్పిన మాటలు అంత నమ్మదగ్గవిగా అనిపించడం లేదు. అందులో మూడు పాయింట్లు చాలా కీలకమైనవి. మొదటిదేమో ఎన్డీయేలో చేరుతానని కేసీయార్ అడిగితే మోడీ కుదరదు పొమ్మన్నారట.

అలాగే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ మద్దతు కావాలని తనను అడిగితే ఇచ్చేదిలేదని స్పష్టంగా చెప్పేశారట. అవినీతి పార్టీలతో తాము పొత్తు పెట్టుకునేది లేదని కచ్చితంగా చెప్పేసినట్లు మోడీ చెప్పారు. ఫైనల్ పాయింట్ ఏమిటంటే ముఖ్యమంత్రిగా తాను తప్పుకుని కొడుకు కేటీఆర్ కు సీఎం పదవిని ఇస్తానంటే ఇదేమైనా రాజరికమా రాజు తర్వాత యువరాజుకు పట్టం కట్టడానికి అని తాను నిలదీసినట్లు చెప్పారు.

ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే కేసీయార్ ఎన్డీయేలో చేరుతానని అంటే మోడీ వద్దనే అవకాశాలు దాదాపు లేదు. ఎందుకంటే మైనస్ బీజేపీ ఎన్డీయే జీరో అన్న విషయం అందరికీ తెలిసిందే. లోక్ సభలో ఎన్డీయేకి 334 సీట్లుంటే ఇందులో 305 సీట్లు బీజేపీదే. ఒక్కసీటు కూడా లేని పార్టీలు ఎన్డీయేలో చాలా ఉన్నాయి. అలాంటిది తొమ్మిది సీట్లున్న బీఆర్ఎస్ ను మోడీ ఎందుకు వద్దనుకుంటారు ? ఇక అవినీతే పెద్ద సమస్య అయితే బీజేపీ మీదే చాలా రాష్ట్రాల్లో ఆరోపణలున్నాయి.

ఇక గ్రేటర్ ఎన్నికల్లో కేసీఆర్ కు బీజేపీ మద్దతు ఏమి అవసరం. గ్రేటర్ లో మద్దతు కోసం కేసీఆర్ ఢిల్లీకి వెళ్ళి మోడీ మద్దతు అడుగుతారా ? చివరగా కేటీయార్ కు పట్టాభిషేకం చేయాలంటే మోడీకి ఎందుకు కేసీయార్ చెప్పాలి ? ఇది పూర్తిగా కేసీయార్ ఇష్టం. కేటీయార్ ను సీఎం చేయాలని కేసీఆర్ అనుకుంటే అందుకు మోడీ అనుమతి అవసరమే లేదని అందరికీ తెలుసు. కాబట్టి కేసీఆర్ గురించి మోడీ చెప్పిన మాటలు అంత నమ్మదగ్గవిగా లేవు.