సుప్రీం కోర్టులో చంద్రబాబుకు చుక్కెదురు

స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తీవ్ర ఉత్కంఠ నడుమ ఈ కేసును ఈ రోజు విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. అయితే, అనూహ్యంగా ఈ రోజు కూడా చంద్రబాబుకు సుప్రీంలో చుక్కెదురైంది. ఆ పిటిషన్ విచారణను సోమవారానికి సుప్రీం కోర్టు వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో సమర్పించిన పత్రాలన్నీ సోమవారం లోపు సమర్పించాలని సీఐడీ తరఫు న్యాయవాది ముకుల్ రోహాత్గీని జస్టిస్ అనిరుధ్ బోస్, జస్టిస్ బేలా త్రివేదిల ద్విసభ్య ధర్మాసనం ఆదేశించింది.

అఫిడవిట్ దాఖలు చేసేందుకు సమయం కావాలని కోర్టును రోహత్గీ కోరారు. తాము అన్ని వివరాలతో రెడీగా ఉన్నామని చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా స్పందించారు. లూథ్రాతో పాటు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు హరీశ్ సాల్వే, మను సింఘ్వీలు చంద్రబాబు తరఫు వాదనలు వినిపించారు. బెయిల్ కోసం అప్పీలు చేయకుండా క్వాష్ పిటిషన్ పై వాదనలు వినిపిస్తున్నారని, చంద్రబాబుకు 17ఏ వర్తించదని రోహత్గీ వాదించారు. 2018లో 17ఏ సవరణ జరిగిందని, స్కిల్ స్కాం అంతకుముందే జరిగిందని వివరించారు.

సెక్షన్ 17ఏ అవినీతి కేసులకు మాత్రమే కాదని, అన్ని కేసులకు వర్తిస్తుందని చంద్రబాబు తరఫు న్యాయవాది సాల్వే బదులిచ్చారు. ఈ కేసు పూర్తిగా రాజకీయ కక్ష సాధింపుతో పెట్టిందని వాదించారు. చంద్రబాబు అవినీతికి పాల్పడినట్టు సీఐడీ ఒక్క ఆధారం కూడా చూపలేకపోయిందని మను సింఘ్వీ వివరించారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో దర్యాప్తుపై జస్టిస్ అనిరుధ్ బోస్ ఆరా తీశారు. ఈ కేసులో చంద్రబాబును సుదీర్ఘకాలం జైల్లో ఉంచేలా కక్ష సాధింపు కనిపిస్తోందని లూథ్రా తెలిపారు.