ఎంఐఎం అడ్డాపై కాంగ్రెస్ కన్ను ?

చాలా సంవత్సరాలుగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఓల్డ్ సిటిపై కాంగ్రెస్ పార్టీ ఆశలు వదిలేసుకున్నది. అప్పుడెప్పుడో ఓల్డ్ సిటీ లోని కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఎప్పుడైతే ఎంఐఎం బాగా పుంజుకున్నదో అప్పటినుండే కాంగ్రెస్ కు డౌన్ ఫాల్ మొదలైంది. సుమారుగా నాలుగు ఎన్నికలుగా ఓల్డ్ సిటి అన్నది ఎంఐఎం పార్టీ అడ్డాగా మారిపోయింది. ఇలాంటి ఓల్డ్ సిటిలోని ఏడు నియోజకవర్గాల్లో పోయిన ఎన్నికల్లో గోషామహల్ నియోజకవర్గంలో బీజేపీ తరపున రాజాసింగ్ గెలిచారు.

ఓల్డ్ సిటిలోని ఏడు నియోజకవర్గాల్లో దాదాపు ఎంఐఎంకు తిరుగన్నదే లేదు. దానికితోడు గడచిన రెండు ఎన్నికల్లో అంటే 2014 నుండి ఎంఐఎంకు బీఆర్ఎస్ పూర్తి స్దాయిలో మద్దతిస్తోంది. దాంతో ఆ పార్టీ మరింతగా చెలరేగిపోతోంది. ఓల్డ్ సిటిలో ఎంఐఎంకు మద్దతుగా బీఆర్ఎస్ నిలబడుతోంది. అందుకనే కాంగ్రెస్, బీజేపీలు ఎంత ప్రయత్నించినా ఎంఐఎంను అన్ని నియోజకవర్గాల్లో ఓడించలేకపోతోంది. అయితే ఇపుడు పరిస్ధితుల్లో కాస్త మార్పు వచ్చినట్లు కనబడుతోంది.

ఓల్డ్ సిటీలో ఎంఐఎంకు బీఆర్ఎస్ మద్దతుగా నిలుస్తుంటే మిగిలిన రాష్ట్రంలో బీఆర్ఎస్ కు ఎంఐఎం అండగా ఉంటోంది. అయితే ఇపుడు తాజా పరిస్ధితి ఏమిటంటే కేసీఆర్ పాలన మీద ముస్లింలలో బాగా వ్యతిరేకత మొదలైపోయిందని సమాచారం. ఎందుకంటే పోయిన ఎన్నికల్లో ముస్లిం మైనారిటీలకు ఇచ్చిన హామీలను కేసీయార్ పట్టించుకోలేదు. ఇదే సమయంలో వివిధ వర్గాలకు కాంగ్రెస్ హామీలిచ్చింది. తుక్కుగూడలో సోనియా ఆధ్వర్యంలో జరిగిన బహిరంగసభలో సిక్స్ గ్యారెంటీస్ అని ప్రకటించింది. దానిపై ముస్లింల్లో ఎక్కువ చర్చలు జరుగుతున్నాయట. అలాగే ముస్లిం పెద్దల్లోని కొందర కాంగ్రెస్ వైపు మొగ్గుచూపుతున్నారు.

ఓల్డ్ సిటీకి చెందిన ముస్లిం మైనారిటిల్లోని ప్రముఖ నేత ఇబ్రహీం మస్కతీ కాంగ్రెస్ లో చేరారు. దీంతో ముస్లింవర్గాల్లో కాంగ్రెస్ వైపు మొగ్గు కనబడుతోంది. దాదాపు నెలన్నర క్రితం కేసీయార్ ప్రకటించిన టికెట్లలో ముస్లింలకు పెద్ద ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇలాంటి అనేక కారణాలతో ముస్లింల్లో కాంగ్రెస్ అంటే మొగ్గు కనబడుతోంది. దీన్ని అడ్డంపెట్టుకుని ఓల్డ్ సిటి పై కాంగ్రెస్ టార్గెట్ పెట్టింది. రాబోయే ఎన్నికల్లో గట్టి అభ్యర్థులను పోటీలోకి దింపాలని డిసైడ్ అయ్యింది. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.