ఐసీయూలో వైసీపీ: పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్‌లో పాలక వైసీపీ అత్యంత క్లిష్ట దశలో ఉంది… ఆరోగ్యం పూర్తిగా క్షీణించి ఐసీయూలో ఉంది.. ఇదీ లేటెస్ట్ పరిస్థితి. ఆ సంగతి జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన వారాహి యాత్రలో జనానికి క్లియర్‌గా చెప్పారు. ఈ సందర్భంగా ఆయన సీఎం జగన్ ఎలాంటివాడో కూడా చెప్పారు. జగన్ రక్తం రుచి మరిగిన నాయకుడని, ఆ రక్తం పేరు రాజ్యాధికారమని పవన్ అన్నారు. జగన్, వైసీపీ ఎన్ని కుయుక్తులు పన్నినా 2024లో టీడీపీ-జనసేన కలిసి అధికారంలోకి రాకుండా అడ్డుకోలేరని ఆయన అన్నారు.

సోమవారం మచిలీపట్నంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన పవన్ కల్యాణ్ టీడీపీతో పొత్తు అంశం మాట్లాడారు. వచ్చే ఎన్నికలలో తమ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరన్నారు. ‘2024లో ఆంధ్రప్రదేశ్ బంగారు భవిష్యత్తు ఉండాలనే బలమైన సంకల్పంతోనే పొత్తు నిర్ణయం తీసుకున్నాం. రాజ్యాధికారం అనే రక్తం మరిగిన వైసీపీ నాయకుడిని ఇంటికి పంపిచడమే ముందున్న లక్ష్యం. అధికారాన్ని వదులుకోవడానికి ఇష్టపడని వైసీపీ ఎన్నికల ముందు మరిన్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో 26 లక్షల పైచిలుకు దొంగ ఓట్లు బయటపడ్డాయి. వైసీపీ ఎన్ని కుయుక్తులు పన్నినా కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో మనం గెలుస్తున్నాం. గెలుపు నిష్పత్తి బట్టి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడా? లేదా? అనేది ఎన్నికల ఫలితాల తరువాత నిర్ణయిద్దాం’ అని పవన్ అన్నారు.

‘వైసీపీ నాయకుడు డ్రాకులా మాదిరిగా అధికారానికి అలవాటుపడ్డాడు. జగన్ ను టీనేజ్ నుంచి గమనిస్తున్నాను. కడప జిల్లాలో ఒక పోలీస్ అధికారిని లాకప్ లో వేసి దాడి చేసిన నైజం అతనిది. జగన్ స్వభావం కూడా అత్యంత దూకుడు, దుర్మార్గంగా ఉంటుందని చాలా మంది సన్నిహితులు చెప్పేవారు. తెలంగాణలో జగన్ బ్యాచ్ చేసిన దోపిడీ అంతాఇంతా కాదు. వారి దోపిడీని భరించలేక తెలంగాణ యువత తిరుగుబాటు చేసింది. ఇలాంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ కు హానికరం అని భావించే మొదటి నుంచి వైసీపీ ఆంధ్రప్రదేశ్ కు హానికరమని చెబుతున్నాను. ఇప్పుడు ఆంధ్ర ప్రజలు ప్రత్యక్షంగా అతను పెడుతున్న బాధలు అనుభవిస్తున్నారు’ అన్నారు పవన్.

వైసీపీ నేతలు మరో 6 నెలల్లో ఇంటికి వెళ్లిపోతున్నారని.. జనసేన నాయకులను, కార్యకర్తలను కేసులు, దాడులు పేరుతో భయపెడితే భవిష్యత్తులో వైసీపీ నాయకులు జనసేన కార్యకర్తల దగ్గరకే వచ్చి కాస్త సహాయం చేయండి అని అడిగే రోజులు దగ్గరలోనే ఉన్నాయని పవన్ కల్యాణ్ అన్నారు. అధికారులు, పోలీసులు కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోవాలని సూచించారు. ఐసీయూలో ఉన్న వైసీపీని చూస్తే జాలి వేస్తుంది.. కొండ అంచుకు వెళ్లి దూకేసేవాడిని చూసి ఏం చేయగలం? ఓడిపోయే పార్టీలోని ఓడిపోయే నాయకులు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు జన సైనికులు వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని పవన్ కల్యాణ్ అన్నారు.