జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాలిటిక్స్‌లో దూకుడు పెంచారు. కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ నుంచి నాలుగో విడత వారాహి యాత్ర ఆదివారం నుంచి మొదలుపెట్టిన జనసేనాని ఈ సందర్భంగా ఏపీలోని రాజకీయ పరిస్థితులు, తన పొత్తుల విషయంలో కీలక ప్రకటనలు చేశారు. అయితే, ఓ వైపు ఇలా ఏపీ పాలిటిక్స్ గురించి వివరిస్తూనే మరోవైపు తెలంగాణలోని అసెంబ్లీ ఎన్నికలపై సైతం పవన్ ఫోకస్ పెట్టారు. తాజాగా త్వరలో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తన పార్టీ బరిలో దిగే స్థానాలపై ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పోటీ చేయనున్న 32 అసెంబ్లీ నియోజకవర్గాల పేర్లను పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
తెలంగాణలో ఎన్నికల హీట్ తారాస్థాయికి చేరిన నేపథ్యంలో జనసేన తరఫున బరిలో నిలవనున్న తెలంగాణ అసెంబ్లీ నియోజకవర్గాల పేర్లను పవన్ కళ్యాణ్ ప్రకటించారు. మొత్తం 32 నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జనసేన పోటీ చేసే స్థానాలుగా కూకట్ పల్లి, ఎల్బీనగర్, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, పటాన్ చెరు, సనతనగర్, ఉప్పల్, మల్కాజిగిరి, మేడ్చల్ అసెంబ్లీ సెగ్మెంట్లను పేర్కొన్నారు. దీంతో పాటుగా జిల్లాల వారీగా నాగర్ కర్నూల్, కొత్తగూడెం, వైరా, ఖమ్మం, పాలేరు. ఇల్లందు, మధిర, అశ్వరావుపేట, మునుగోడు, వరంగల్ వెస్ట్, వరంగల్ ఈస్ట్, పాలకుర్తి, నర్సంపేట, స్టేషన్ ఘన్పూర్, హుస్నాబాద్, రామగుండం, జగిత్యాల, నకిరేకల్, హుజుర్ నగర్, మంథని, కోదాడ, సత్తుపల్లి, ఖానాపూర్ స్థానాల్లో జనసేన బరిలో నిలవనున్నట్లు వెల్లడించారు.
తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష నెరవేర్చడమే లక్ష్యంగా తాము ఎన్నిలక బరిలో నిలుస్తున్నట్లు జనసేన పార్టీ ప్రకటించింది. తద్వారా జనసేన పార్టీ కేవలం ఏపీకి మాత్రమే పరిమితం కావడం లేదనే సందేశాన్ని సైతం పవన్ కళ్యాణ్ పంచుకున్నారు. అదే సమయంలో తెలంగాణలోని పరిణామాల పట్ల తాము అవగాహనతోనే ఉన్నట్లు వెల్లడించారు. దీంతోపాటుగా తెలంగాణలోని జనసేన పార్టీ నేతలు క్రియాశీలంగా ఉండేలా ఎన్నికలకు సన్నద్ధం అయేందుకు సైతం ఈ ప్రకటన దోహదపడుతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.