ఓటుకు నోటు కేసు : అక్టోబర్ 4వ తేదీన విచారణ

టీడీపీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు అరెస్ట్ నేప‌థ్యంలో కేటీఆర్ వ్యాఖ్యలు ఎంత వైరల్ అయ్యాయో ఇప్పటికే విన్నాం. ఈ నేపథ్యంలో మరో పరిణామం అందరినీ షాక్ కు గురిచేసింది. అప్పట్లో కొన్నేళ్ల కింద‌ట క‌ల‌క‌లం రేపిన ఓటుకునోటు కేసు విచార‌ణలో జాప్యం జ‌రుగుతోంద‌ని, సీబీఐతో విచారణ జరిపించాలని మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గ‌తంలోనే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖ‌లు చేశారు. అయితే, ఓటు నోటు కేసు పిటిషన్ తాజాగా విచారణకు వచ్చింది. అక్టోబర్ 4వ తేదీన పిటిషన్‌పై విచారణ జరుగనుంది.ఈ ఎపిసోడ్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రేణుల‌ను క‌ల‌వ‌ర‌పాటుకు గురిచేస్తోంది.

చంద్రబాబు క్వాష్ పిటిషను అంత అర్జెంటేంటని ఒకవైపు ప్రశ్న వచ్చిన వేళ… చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణ మరుసటి రోజు ఓటుకు నోటు కేసు లిస్ట్ అవడం ఆసక్తికరమైన రాజకీయ చర్చకు దారితీసింది.

స్కిల్‌ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టు వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ అక్టోబర్ 3వ తేదీన విచారణకు రానుంది. తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌, రిమాండ్ రిపోర్ట్‌ను క్వాష్ చేయాలని కోరుతూ చంద్ర‌బాబు వేసిన పిటిష‌న్ లో ఏం జ‌ర‌గ‌నుందో అనే ఉత్కంఠ ఓ వైపు కొన‌సాగుతుండ‌గా… ఆ మరుసటి రోజే ఓటుకు నోటు కేసు కూడా విచారణకు రానుంది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌ కేసు, ఇత‌ర‌ వరుస కేసులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రికి ఇప్పుడు ఓటుకు నోటు కేసు కూడా తోడైందని ప‌లువురు టీడీపీ అభిమానులు నెట్టింట ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

చంద్రబాబు నాయుడికి క‌ష్ట‌కాలంలో ముందుకు వ‌చ్చిన ఓటుకు నోటు కేసు విచార‌ణ సూత్ర‌దారి తెలంగాణ సీఎం కేసీఆర్ అయితే అందులో పాత్రదారి ఏపీ సీఎం జ‌గ‌న్ అంటూ కొంద‌రు కామెంట్లు చేస్తున్నారు. త‌మ నాయ‌కుడిని ఇబ్బందుల పాలు చేయాల‌ని, రాబోయే ఎన్నిక‌లకు సిద్ధ‌మ‌య్యే వ్యూహాన్ని ర‌చించ‌కుండా కోర్టుల చుట్టూ తిప్పాల‌నే ఎత్తుగ‌డలో ఈ ఇద్ద‌రు సీఎంలు ఉన్నార‌ని మండిప‌డుతున్నారు.