చంద్రబాబు అరెస్టు మీద బీఆర్ఎస్ అగ్ర నాయకులు స్పందిస్తున్నారు. బాబు అరెస్టు దురద్రుష్టకరమని బీఆర్ఎస్ ప్రధాన నాయకుడు, మంత్రి హరీష్ రావు తాజాగా పేర్కొన్నారు. మరోవైపు చంద్రబాబు మాటెత్తని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.. దివంగత ఎన్టీఆర్ ను మాత్రం కీర్తిస్తున్నారు. అయితే చంద్రబాబు అరెస్టు విషయంలో బీఆర్ఎస్ కు జరుగుతున్న డ్యామేజీని కవర్ చేసేందుకే హరీష్, కేటీఆర్ ఇలా రంగంలోకి దిగారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ నేరుగా మాట్లాడకుండా హరీష్, కేటీఆర్ తో మాట్లాడిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. కానీ ఇప్పటికే బీఆర్ఎస్కు జరిగిన డ్యామేజీ తిరిగొస్తుందా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
స్కిల్ డెవలప్మంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టయి రిమాండ్ మీద జైల్లో ఉన్నారు. ఆయన అరెస్టుకు నిరసనగా టీడీపీ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అయితే హైదరాబాద్లో ఐటీ ఉద్యోగులు తదితర వర్గాల ప్రజలు ర్యాలీ చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతినివ్వట్లేదు. ఏమైనా ఉంటే ఏపీలో చేసుకోండని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్లో ర్యాలీలకు అనుమతినిచ్చేదే లేదన్నారు. దీంతో కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్, టీడీపీ విమర్శలు చేశాయి. దీంతో బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఇక్కడి చంద్రబాబు మద్దతుగా ఉన్న ఆంధ్ర సెటిలర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఓ వైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు చంద్రబాబు అరెస్టును ఖండించారు. చంద్రబాబుకు మద్దతుగా ర్యాలీల్లోనూ పాల్గొన్నారు. అయితే కేసీఆర్ అనుమతితోనే ఇవన్నీ జరుగుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్ర సెటిలర్ల ఓట్ల కోసమే కేసీఆర్ ఇలా చేస్తున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు తెలంగాణ ప్రజల ఓట్ల కోసం చంద్రబాబు అరెస్టుపై నేరుగా కేసీఆర్ స్పందించలేకపోతున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే హరీష్ తో కేసీఆర్ మాట్లాడించినట్లు వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కానీ ఈ పరిణామాలు బీఆర్ఎస్ కు జరిగిన డ్యామేజీని తగ్గిస్తాయా? అన్నదే ఇక్కడ ప్రశ్న.