తెలంగాణ కాంగ్రెస్ ను శాసిస్తున్న డీకే!

జాతీయ పార్టీలను నడిపించేది, దిశా నిర్దేశం చేసేది ఢిల్లీలోని అధిష్టానమే. రాష్ట్రాల్లో ఆయా జాతీయ పార్టీల కార్యకలాపాలు ఢిల్లీ కనుసన్నల్లోనే జరుగుతాయి. కాంగ్రెస్ లోనూ అంతే. కానీ ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మాత్రం వేరేలా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే… తెలంగాణ టూ ఢిల్లీ వయా బెంగళూరు అన్నట్లు ఇక్కడి కాంగ్రెస్ రాజకీయాలు సాగుతున్నాయనే చెప్పాలి. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లోని కీలక నాయకులు, పార్టీలో చేరాలనుకునే వాళ్లు బెంగళూరుకు క్యూ కడుతుండటమే అందుకు కారణం. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ లో కీలక నాయకుడు డీకే శివకుమార్.. తెలంగాణ కాంగ్రెస్ ను శాసిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.

కర్ణాటకలో ఆశలు లేని కాంగ్రెస్ ను గెలిపించడంతో ఒక్కసారిగా డీకే శివకుమార్ ఫేమస్ అయ్యారనే చెప్పాలి. కాంగ్రెస్ అధిష్ఠానం కూడా ఆయనకు అధిక ప్రాధాన్యతనిస్తోంది. జాతీయ స్థాయిలోనూ ఆయన మాట చెల్లుబాటు అవుతుందనే అభిప్రాయాలున్నాయి. మరోవైపు దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ వ్యవహారాలు అన్నింటినీ ఇప్పుడు డీకే శివకుమార్ చూసుకుంటున్నారనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ తెలంగాణ నాయకులు కూడా డీకేను కలిసేందుకు బెంగళూరుకు వెళ్తున్నారు.

ఇటీవల టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బెంగళూరు వెళ్లి డీకేను కలిశారు. రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, రాష్ట్రంలో పార్టీ పరిస్థితులు, చేపట్టాల్సిన కార్యచరణ తదితర అంశాలపై చర్చించారు. ఇక కాంగ్రెస్ లో తన పార్టీ విలీనం కోసం షర్మిల.. డీకే శివకుమార్ తోనే మొదట చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. డీకే మధ్యవర్తిత్వంతోనే షర్మిల ఢిల్లీ వెళ్లి పలు దఫాలుగా కాంగ్రెస్ హైకమాండ్ తోనూ చర్చించారు. మరోవైపు కాంగ్రెస్ లో చేరాలనుకుంటున్న ఇతర పార్టీ నాయకులు కూడా డీకేను కలుస్తున్నారు. కాంగ్రెస్ లో చేరే ముందు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు డీకేతో సమావేశమయ్యారు. ఇప్పుడు మరో మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు కూడా డీకేను కలిశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ లో కీలక పరిణామాలు అన్నీ డీకే కనుసన్నల్లోనే జరుగుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.