ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు సంబంధించి రూ.341 కోట్ల అవకతవకలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేసి జైల్లో పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ కేసులోనే కీలక సూత్రధారిగా ప్రభుత్వం పేర్కొంటున్న పెండ్యాల శ్రీనివాస్‌ను సర్కారు విధుల నుంచి సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.
ఎవరీ పెండ్యాల?
పెండ్యాల శ్రీనివాస్… ఐఏఎస్ అధికారి. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనూ ఆయన ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించారు. పలు కీలక పథకాల రూపకర్తగా కూడా ఆయనకు మంచి పేరుంది. తర్వాత.. రాష్ట్ర విభజనతో అప్పటి సీఎం చంద్రబాబు పెండ్యాలను ప్రత్యేకంగా తనకు పర్సనల్ సెక్రటరీగా నియమించుకున్నారు. ఇక, జగన్ సర్కారు హయాంలోనూ ఆయనకు మంచి పదవే దక్కింది. ప్రణాళికా విభాగంలో అసిస్టెంట్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నారు.
ఎందుకీ సస్పెన్షన్?
అయితే, తాజాగా ఏపీ ప్రభుత్వం పెండ్యాల శ్రీనివాస్‌ను సస్పెండ్ చేయడం వెనుక సర్కారు వాదన ప్రకారం.. ఆయనకు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో కీలక పాత్ర ఉంది. అయితే, ఈ కేసు విచారణ ప్రారంభమవుతుందన్నప్పటి నుంచి ఆయన కనిపించకుండా పోయారనేది ప్రభుత్వ వాదన. అంతేకాదు.. ఉద్దేశ పూర్వకంగా ఆయన దేశం విడిచిపోయారని, ఆయనకు కొందరు విమాన టికెట్లను కూడా కొని ఇచ్చారని సర్కారు చెబుతోంది.
ఈ వివరాలన్నీ.. తమ వద్ద ఉన్నాయని..ఇ టీవల అసెంబ్లీలోనూ సీఎం జగన్ స్వయంగా చెప్పుకొచ్చారు. ఇక, ఇప్పుడు ఆయనను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ.. జీవో జారీ చేయడం సంచలనంగా మారింది.