తెలంగాణలో వరుసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ భయపడుతోంది. బీఆర్ఎస్ కు భయమేంటీ? అనుకుంటున్నారా? అవును.. వరుసగా మూడో సారి గెలవాలనే లక్ష్యంతో ఉన్న ఆ పార్టీని కొన్ని గుర్తులు భయపెడుతున్నాయి. ఆ గుర్తులు బీఆర్ఎస్ గుర్తు కారును పోలి ఉండటమే ఇందుకు కారణం. అలాంటి గుర్తుల వల్ల బీఆర్ఎస్ కు పడాల్సిన ఓట్లు ఇతరులకు వెళ్తున్నాయని బీఆర్ఎస్ టెన్షన్ పడుతోంది. అందుకే కారును పోలిన గుర్తులను తొలగించాలని భారత ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ విన్నవించింది.
2018 ఎన్నికల్లో కారును పోలిన కెమెరా, చపాతీ రోలర్, డోలి, రోడ్డు రోలర్, సబ్బు పెట్టె, టెలివిజన్, కుట్టుమిషన్, ఓడ కారణంగా కొన్ని చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులకు నష్టం వాటిల్లిందని ఆ పార్టీ చెబుతోంది. ముసలి వాళ్లు, కంటి చూపు పూర్తిగా లేనివాళ్లు.. ఈ గుర్తులనే కారు గుర్తుగా అనుకుని ఇతర అభ్యర్థులకు ఓట్లు వేశారని బీఆర్ఎస్ చెబుతోంది. 2019 లోక్ సభ ఎన్నికల్లోనూ ఇలాగే జరిగిందని ఆ పార్టీ అంటోంది. ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా ఎంతో కీలకం. అలాంటిది ఈ గుర్తుల వల్ల బీఆర్ఎస్కు రావాల్సిన ఓట్లు ఇతరులకు వెళ్తున్నాయని బీఆర్ఎస్ టెన్షన్ పడుతోంది. ఓటర్లను పక్కదారి పట్టించేందుకు కొన్ని అప్రజాస్వామిక శక్తులు పని చేస్తున్నాయని కూడా బీఆర్ఎస్ ఆరోపిస్తోంది.
అందుకే ఈ సారి ముందుగానే బీఆర్ఎస్ అప్రమత్తమైంది. కారును పోలిన గుర్తులను జాబితా నుంచి తొలగించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని రిక్వెస్ట్ చేసింది. ఢిల్లీలో సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ ధర్మేంద్ర శర్మ, డిప్యూటీ ఎన్నికల కమిషనర్ అజయ్ భాదూను బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత, మహబూబ్ నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ కలిశారు. కారును పోలిన గుర్తులను తొలగించాలని కోరారు. అలాగే ఇటీవల యుగ తులసి పార్టీకి కేటాయించిన రోడ్డు రోలర్ గుర్తును రద్దు చేయాలని కూడా రిక్వెస్ట్ చేశారు.