నాట్ బిఫోర్ మీ..బాబుకు సుప్రీం జడ్జి షాక్

స్కిల్ డెవలప్మెంట్ కేసులో తనపై దాఖలైన ఎఫ్ ఐఆర్ ను క్వాష్ చేయాలంటూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, హైకోర్టు తీర్పును చంద్రబాబు తరఫు లాయర్లు సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. ఈ సందర్భంగా ఈ రోజు సుప్రీం కోర్టులో జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ధర్మాసనం ముందుకు ఆ పిటిషన్ విచారణకు వచ్చింది. అయితే, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ‘నాట్ బిఫోర్ మీ’ అనడంతో ఈ పిటిషన్ విచారణ వారం రోజుల పాటు వాయిదా పడింది. ఏపీకి చెందిన జస్టిస్ వెంకట నారాయణ భట్టి ఈ పిటిషన్ పై విచారణ జరిపేందుకు విముఖత చూపడంతో మరో బెంచ్ కు ఈ పిటిషన్ బదిలీ అయింది.

చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ హరీష్ సాల్వే వర్చువల్ విధానంలో, సిద్ధార్థ్ లూథ్రా, సిద్ధార్థ్ అగర్వాల్, ప్రమోద్ కుమార్ లు సుప్రీంకోర్టుకు హాజరై వాదనలు వినిపించారు. ఏపీ ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్గీ, రంజిత్ కుమార్ వాదనలు వినిపించారు. అయితే, సీజేఐ బెంచ్ ఈ పిటిషన్ విచారణ జరపాలని కోరతానని లూథ్రా అన్నారు.

మరోవైపు,ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ మార్పు కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. సీఐడీ తరఫున వాదనలను అడ్వకేట్ జనరల్ శ్రీరాం వినిపిస్తున్నారు. ఇక, విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై వాదనలు కొనసాగుతున్నాయి.