పథకాలకు బ్రేకులు తప్పవా ?

తెలంగాణాలో అమలవుతున్న అనేక పథకాలకు బ్రేకులు పడబోతున్నాయని సమాచారం. ఎందుకంటే రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునేట. వినటానికి కాస్త విచిత్రంగా ఉన్నా ఇదే నిజమని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే షెడ్యూల్ ఎన్నికలు మరో మూడు నెలల్లో కి వచ్చేశాయి. కొన్ని పథకాలకు ఇప్పటికీ అవసరమైన నిధులు అందలేదు. దాంతో కేసీయార్ లో టెన్షన్ బాగా పెరిగిపోతోంది. ఇందులో భాగంగానే ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకోబోతున్నట్లు ప్రచారంలో ఉంది.

అదేమిటంటే ఇప్పుడు అమల్లో ఉన్న పథకాలకు నెల లేదా రెండు నెలలపాటు బ్రేకులు వేయాలని. ఎందుకంటే పథకాల అమలుకు అవసరమైన పూర్తి నిధులను సమీకరించుకోవచ్చు. రెండోది సరిగ్గా ఎన్నికలకు ముందు లబ్దిదారులకు పథకాలను వర్తింపచేయచ్చు. ఇప్పుడే గనుక పథకాల నిధులను లబ్దిదారులకు అందించేస్తే ఎన్నికల సమయంలో నిధుల ఇబ్బందులు తలెత్తితే చాలా గొడవైపోతుందని కేసీయార్ అనుమానిస్తున్నారు.

అదే ఇప్పుడు ఒక నెల రోజులు పథకాన్ని బ్రేక్ వేసి పూర్తి స్ధాయి నిధులను సమీకరించేసి తర్వాత పథకాలను అమలు చేస్తే సరిగ్గా ఎన్నికల సమయానికి నిధుల సమస్యలు తలెత్తకుండా ఉంటాయని అనుకుంటున్నారు. రైతు రుణమాఫీ పూర్తిగా అమలు కావాలంటే మరో రు. 8500 కోట్లు కావాలి. అలాగే దళితబంధు, బీసీ బంధు, మైనారిటీలకు లక్ష సాయం, గృహలక్ష్మి పథకాలకు బ్రేకులు వేస్తే ఎలాగుంటుందనే ఆలోచన కేసీయార్లో మొదలైందట. అంటే సంక్షేమ పథకాలనే ఎన్నికల్లో గెలుపుకు ఓటు బ్యాంకుగా మార్చుకోవాలన్నది కేసీయార్ ఆలోచనగా తెలుస్తోంది.

మరీ ఆలోచన ఎంతవరకు వర్కవుటవుతుంన్న విషయమై కసరత్తు జరుగుతోంది. మామూలుగా పథకాలు ప్రకటించిన దగ్గర నుంచి అమలు చేస్తేనే జనాలు గుర్తుంచుకుంటారు. ఎన్నికల సమయంలో పథకాలను ప్రకటించేసి తర్వాత పట్టించుకోకుండా మళ్ళీ ఎన్నికలకు ముందు పథకాలను అమలు చేస్తే జనాలు ఎందుకు పట్టించుకుంటారు. రైతు రుణమాఫీ, దళితబంధు, బీసీ బంధు, మైనారిటీలకు ఆర్థిక సాయం లాంటి పథకాలన్ని ఇలాగే కేసీఆర్ అమలు చేస్తున్నారు. పథకాల్లో లబ్దిని జనాలు అందుకుంటారు కానీ ప్రభుత్వాన్ని ఎంతవరకు గుర్తుంచుకుంటారన్నది అనుమానమే. ఎందుకంటే ఐదేళ్ళ క్రితం అమలవ్వాల్సిన రైతు రుణమాఫీ ఇపుడు అమలవుతోంది. దీనివల్ల రైతులకు పెద్దగా లాభం లేదని సమాచారం. మరి పథకాల లబ్ధిదారులు ఎన్నికల్లో ఎలా రియాక్టవుతారో చూడాలి.